ముంబైలో ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి వచ్చిన ఒక ప్రముఖ సంస్థకు చెందిన డెలివరీ బాయ్, యువతికి అసభ్యకరమైన ఆడియో మెసేజ్‌లు పంపి బెదిరించిన ఘటన దేశవ్యాప్తంగా మహిళల్లో తీవ్ర భయాందోళనలను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
ముంబైకి చెందిన నిషా బాలకృష్ణ అనే యువతి జూన్ 16న ఇంట్లో లేని సమయంలో, ‘షాడోఫాక్స్’ (Shadowfax) అనే లాజిస్టిక్స్ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో, ఆ కాల్ నేరుగా వాయిస్ మెయిల్‌కు వెళ్ళింది.
ఆ తర్వాత ఆ వాయిస్ మెయిల్‌ను విన్న యువతి అందులోని అసభ్యకరమైన, అశ్లీల పదాలను విని దిగ్భ్రాంతికి గురైంది. ఆ ఆడియోలో, “మేడమ్, మీ వాయిస్ వినగానే నాకు.. మీతో..!” అంటూ ఆ డెలివరీ బాయ్ చాలా నీచంగా మాట్లాడటమే కాకుండా, బూతు పదాలతో ఆమెను భయభ్రాంతులకు గురిచేశాడు.
తన ఇంటి అడ్రస్ ఆ డెలివరీ బాయ్‌కు తెలుసు కాబట్టి, తన ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్లుతుందేమోనని భయపడిన ఆ యువతి, వెంటనే ఆ ఆడియో ఆధారాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ముంబై పోలీసులకు, సంబంధిత సంస్థకు ట్యాగ్ చేస్తూ న్యాయం చేయాలని కోరింది.
సోషల్ మీడియాలో లక్షలాది మంది చూసి, వైరల్ అవుతున్న ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “మహిళలకు భద్రత ఎక్కడ ఉంది?” అంటూ మండిపడుతూ, యువతి ఇంటి అడ్రస్ తెలిసిన ఆ కామాంధుడిపై ముంబై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని కటకటాల్లోకి పంపాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.
