డబ్బు అనేది జీవితాన్ని నడిపించడానికి ఒక సాధనం మాత్రమే. కానీ, అదే డబ్బు చేతిలో లేనప్పుడు కలిగే అప్పుల భారం, ఒక మనిషిని ఎంతటి విపరీతమైన నిర్ణయానికి నెట్టివేస్తుందో చెప్పడానికి నిదర్శనంగా కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఒక గుండెలను పిండేసే దారుణమైన ఘటన జరిగింది.
ఒక పారిశ్రామికవేత్త తన భార్యను, ఇద్దరు పసి కుమార్తెలను చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
మైసూర్ జిల్లా హున్సూర్ నగరంలో నివసిస్తున్న 42 ఏళ్ల హరీష్ అనే పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ మరియు కొన్ని వ్యాపారాలు చేసేవాడు. ఇతనికి నిశ్చిత (34) అనే భార్య, నిక్ష (12), రక్ష (8) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన జరిగిన రోజు వీరి ఇంటి నుండి ఎటువంటి శబ్దం రాకపోవడంతో అనుమానించిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసులకు ఎదురైంది తీవ్రమైన షాక్. ఆ ఇంట్లో నలుగురూ శవాలై పడి ఉన్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో, హరీష్ తన వ్యాపారంలో వచ్చిన తీవ్రమైన నష్టం, అప్పుల భారం కారణంగానే ఈ విపరీతమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తేలింది. సంఘటనకు మూడు రోజుల ముందే, తనతో పాటు నివసిస్తున్న వృద్ధురాలైన తల్లిని ఎవరికీ చెప్పకుండా బంధువుల ఇంటికి పంపించివేశాడు హరీష్. ఆ తర్వాత, అర్ధరాత్రి వేళ తన భార్య మరియు ఇద్దరు కుమార్తెల నోరు, ముక్కు భాగాలను ప్లాస్టర్‌తో ముసివేసి, వారు ఊపిరాడక తల్లడిల్లి చనిపోయేలా హత్య చేశాడు. వారు మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాత, ఇంటి మొదటి అంతస్తుకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకునే ముందు హరీష్ ఒక లేఖను కూడా రాసి పెట్టాడు. అందులో, “నేను మొదటి అంతస్తులో ఉన్న గదిలో ఉరికి వేలాడుతూ ఉంటాను. ఆస్తి పత్రాలు అన్నీ లాకర్‌లో ఉన్నాయి. దాని తాళం చెవి ఈ స్థలంలో ఉంది. దీనిని ఇందులో పేర్కొన్న వ్యక్తికి అప్పగించండి” అని అత్యంత స్పష్టంగా రాశాడు. హరీష్ తల్లిని పోలీసులు విచారించినప్పుడు, తమకు ఎక్కువ మొత్తంలో అప్పుల భారం ఉన్న మాట నిజమేనని కన్నీళ్లతో తెలిపింది. వ్యాపారంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం మాత్రమే కారణమా లేక కుటుంబంలో వేరే ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో మైసూర్ ఎస్పీ మల్లికార్జున బాల్దండి నాయకత్వంలోని పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు.
