తన వివాహం కోసం తల్లిదండ్రులు ఏకంగా రూ. 17 లక్షల వరకు ఖర్చు చేయడంతో, వారి రిటైర్మెంట్ (వృద్ధాప్య) కాలానికి ఎలాంటి పొదుపు లేదని తెలుసుకున్న 26 ఏళ్ల యువతి తీవ్ర ఆవేదనతో ఇంటర్నెట్ వేదికగా నెటిజన్ల సలహాలు కోరింది.
తాము దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబమని, తన తండ్రి ఎంతో కష్టపడి కొన్న ఇల్లు, 30 లక్షల విలువైన బంగారం మాత్రమే ప్రస్తుతం వారి వద్ద మిగిలి ఉన్నాయని ఆ యువతి తెలిపింది.
తాను ఇప్పుడే కొత్త ఉద్యోగంలో చేరానని, నెలకు కేవలం రూ. 20,000 మాత్రమే సంపాదిస్తున్నానని.. రేపు తల్లిదండ్రులకు ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి వస్తే వారిని ఎలా ఆదుకోవాలో అర్థం కాక తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆమె వాపోయింది.
తన తండ్రి తన మామకు రూ. 10 లక్షలు అప్పుగా ఇచ్చారని, మిగిలిన పొదుపు మొత్తాన్నంతా తన పెళ్లికే ఖర్చు చేసేశారని ఆ యువతి విచారంతో పంచుకుంది.
ఆమె ఆవేదనను చూసిన నెటిజన్లు.. ముందుగా భయపడటం మాని, తల్లిదండ్రులకు తెలియకుండా ప్రతినెలా కొంతకొంతగా డబ్బును పొదుపు చేస్తూ, రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలంటూ ఆమెకు ధైర్యం చెబుతూ వివిధ రకాల సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
