పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో చిన్నపాటి కారు ప్రమాదం తర్వాత ఓ మహిళను 20 నుంచి 30 మంది పురుషులు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగిన ఘటన కలకలం రేపుతోంది. తన ఫోన్, కారు తాళాలు తిరిగి ఇవ్వాలంటూ ఆ మహిళ రోడ్డుపై వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అక్టోబర్ 28న కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్ ప్రాంతంలో జౌహర్ మోర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆయిషా జాహిద్ అనే మహిళ సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నట్లు కథనాలు వెల్లడించాయి. ఆమె కారు మరో వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టడంతో వివాదం మొదలైంది.
ప్రమాదం తర్వాత ఎవరికైనా గాయాలయ్యాయా అని తెలుసుకునేందుకు తాను కారు దిగి వచ్చానని ఆయిషా తెలిపారు. అయితే, అప్పటికే అక్కడికి చేరుకున్న సుమారు 20 నుంచి 30 మంది పురుషులు తనను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారని ఆమె ఆరోపించారు. వారిలో కొందరు తనపై దాడి చేయాలని కేకలు వేసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో పలువురు ఆమె కారును చుట్టుముట్టి వాదిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తన ఫోన్, కారు తాళాలు తిరిగి ఇవ్వాలని ఆమె వేడుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాను మాదకద్రవ్యాలు సేవించానంటూ కొందరు ఆరోపించారని, అయితే ఆ ఆరోపణల్లో నిజం లేదని ఆయిషా స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరికైనా గాయాలయ్యాయా అని చూడటానికే కారు దిగానని తెలిపారు. తన ఫోన్, కారు తాళాలు అడిగినప్పుడు గుంపుగా చుట్టుముట్టారని, కొందరు తనను పట్టుకుని లాగారని ఆరోపించారు. అక్కడి పరిస్థితులకు భయపడి మహిళా పోలీసును పిలిపించాలని కూడా కోరినట్లు చెప్పారు.
ఈ వీడియో బయటకు రావడంతో కరాచీలో మహిళల భద్రత, బహిరంగ ప్రదేశాల్లో వారిపట్ల వ్యవహరిస్తున్న తీరుపై చర్చ మొదలైంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇరు వర్గాల వాదనలు ఇంకా స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆయిషా చేసిన ఆరోపణలపై అధికారిక విచారణ వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
