ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వెస్ట్ ప్రాంతంలోని మహాగున్ మైవుడ్స్ (Mahagun Mywoods) అపార్ట్మెంట్లో, 23వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి భర్త, 11 ఏళ్ల కుమారుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ విషాద ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భార్య కూడా అదే బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. అయితే, సరైన సమయంలో అపార్ట్మెంట్ వాసులు అడ్డుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణ్‌దీప్ భద్రా (40), అతని భార్య అమృత, కుమారుడు ఆరవ్.. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని మహాగున్ మైవుడ్స్ అపార్ట్మెంట్ 23వ అంతస్తులో నివసిస్తున్నారు. రణ్‌దీప్, అమృత ఇద్దరూ ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఈ కుటుంబం ఖాటు శ్యామ్ ఆలయానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. దీనికోసం ఉదయం పూజకు పూలు కోసేందుకు రణ్‌దీప్, అతని కొడుకు బాల్కనీకి వెళ్లారు.
ఆ సమయంలో నిచ్చెన ఎక్కి పూలు కోస్తున్న బాలుడు ఆరవ్ అదుపు తప్పి కింద పడిపోయాడని, అతడిని రక్షించే ప్రయత్నంలో తండ్రి కూడా కింద పడిపోయాడని ప్రాథమిక సమాచారం. 23వ అంతస్తు నుంచి కిందపడిన ఇద్దరినీ చుట్టుపక్కల వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న బిస్రఖ్ (Bisrakh) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
భర్తను, కొడుకును ఒకేసారి కోల్పోయిన అమృత తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు చెబుతున్నారు. ఆమె పదే పదే స్పృహ కోల్పోవడం, తిరిగి స్పృహ రాగానే భర్త, కొడుకును పిలుస్తూ కన్నీరుమున్నీరుగా విలపించినట్లు వార్తలు తెలుపుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆమె అకస్మాత్తుగా లేచి, వాళ్లిద్దరూ కిందపడిన అదే బాల్కనీ వైపు వెళ్లి కిందకు దూకేందుకు ప్రయత్నించగా.. అపార్ట్మెంట్ వాసులు ఆమెను పట్టుకుని అడ్డుకున్నట్లు, బంధువులు ఆమెకు ధైర్యం చెబుతున్నట్లు సమాచారం. తండ్రీకొడుకుల మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
