ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో, కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీసులపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ ఘర్షణలో, ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ను నిరసనకారులు కిందకు తోసేయడమే కాకుండా, ఆయన కింద పడిన తర్వాత కూడా దారుణంగా కాళ్లతో తన్నారు.
ఈ షాకింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో, బాధితుడైన ఆ పోలీసు తన ఆవేదనను పంచుకున్నాడు. ‘నాకు తగిలిన శారీరక గాయాల కంటే, నా ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.
‘ఈ వీడియో చూసిన నా భార్య కంగారుపడి ఫోన్ చేసి అడిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఫోన్ చేసి ఆరా తీస్తున్నప్పుడు నాకు చాలా అవమానంగా అనిపించింది. నిరసనల్లో ఎవరు కింద పడినా మేమే పైకి లేపుతాము, కానీ ఈరోజు మాకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిర్వహించిన ఈ నిరసనలో, పోలీసు అధికారులపై ఆందోళనకారులు దారుణంగా దాడి చేసిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
