క్రికెట్ మైదానంలో సిక్సర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుతం ‘రైజ్ అండ్ ఫాల్ 2’ అనే రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ షోలో కంటెస్టెంట్లుగా ఉన్న బీహార్ ఇన్ఫ్లుయెన్సర్ మనీష్ కశ్యప్, గౌతమ్ గులాటిల మధ్య తరచూ తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. తాజా ఎపిసోడ్లో హద్దులు మీరిన వీరిద్దరూ బహిరంగంగా అసభ్య పదజాలంతో దూషించుకోవడమే కాకుండా, ఒకరినొకరు బహిరంగంగా బెదిరించుకున్నారు. ఇది చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన హోస్ట్ సెహ్వాగ్, వారాంతపు ‘పవర్ ప్లే’ ఎపిసోడ్లో సదరు కంటెస్టెంట్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
మనీష్ కశ్యప్ తన బ్యాక్‌గ్రౌండ్ గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని ఉద్దేశించి సెహ్వాగ్ బదులిస్తూ.. “నేను ఏ ప్రాంతం నుంచి వచ్చానో నీకు తెలుసా? ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో రౌడీయిజం సర్వసాధారణం. అక్కడ కాల్పులు, హత్యలు జరగడం మామూలే. కానీ, నేను ఎప్పుడైనా ఆ విషయాలను ఎవరికైనా గొప్పగా చెప్పుకున్నానా?” అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించాడు. దీనికి మనీష్, గౌతమ్ వైపు నుంచి సరైన వివరణ రాకపోగా, ఇద్దరూ మళ్లీ ఒకరినొకరు నిందించుకుంటూ వాదిస్తూనే ఉన్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సెహ్వాగ్, కోపంతో షోను మధ్యలోనే వదిలేసి వేదిక దిగి వెళ్లిపోయాడు.
కాసేపటి తర్వాత మళ్లీ తిరిగొచ్చిన సెహ్వాగ్, షోను విజయవంతంగా కొనసాగించాడు. ఇదిలా ఉండగా, ఈ షోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెహ్సీన్ పూనావాలా కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే అతని సోదరుడు షెహజాద్ పూనావాలా కూడా ఇందులో కంటెస్టెంట్‌గా ఉండటంతో, తెహ్సీన్ రాకతో షోపై మరింత ఆసక్తి పెరిగింది. సెహ్వాగ్ ఇచ్చిన ఈ సీరియస్ వార్నింగ్, షోలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
