2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన బాల్ టాంపరింగ్ వివాదం.. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో ఈ వివాదానికి సంబంధించి పలు సంచలన విషయాలను వెల్లడించారు. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫ్యానీ డి విల్లియర్స్ తీవ్రంగా స్పందించారు.
పెర్త్‌లోని ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. “గత 40, 50 ఏళ్ల క్రికెట్ చరిత్రలో నేను చూసిన అతిపెద్ద ద్రోహి ఉస్మాన్ ఖవాజానే” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తోటి ఆటగాళ్లను బయటపెట్టి, జట్టు క్రమశిక్షణను ఖవాజా ఉల్లంఘించారని ఆరోపించారు. ఇప్పటికే ముగిసిపోయిన చేదు అధ్యాయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి ఆస్ట్రేలియా క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జరిగిన టెస్టు మ్యాచ్‌లోనే కాకుండా, 2017-18 యాషెస్ సిరీస్‌లో కూడా బంతి స్వభావాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, ఈ ఆరోపణలను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ఇదే సమయంలో, ఆ వివాదంలో ప్రత్యక్షంగా పట్టుబడిన ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ మరో సంచలన విషయాన్ని వెల్లడించారు.
ఓ ప్రముఖ వార్తాపత్రికలో సుమారు 4,497 పదాలతో రాసిన సుదీర్ఘ వ్యాసంలో బాన్‌క్రాఫ్ట్ కీలక విషయాలను బయటపెట్టారు. బంతి ఆకారాన్ని మార్చే ప్రణాళిక గురించి జట్టులోని అందరికీ తెలుసునని ఖవాజా చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.
బంతికి రివర్స్ స్వింగ్ లభించేందుకు సాండ్‌పేపర్ ఉపయోగించిన తన చర్యను తోటి ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ప్రోత్సహించారని బాన్‌క్రాఫ్ట్ వెల్లడించారు. జట్టు మీడియా మేనేజర్ కేట్ హడ్సన్ మినహా మిగతా వారందరికీ ఈ అక్రమ చర్య గురించి తెలుసని తన వ్యాసంలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పాట్ కమిన్స్ దీర్ఘకాలిక ఏజెంట్ నీల్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఎనిమిదేళ్ల క్రితం కమిన్స్ తీసుకున్న వైఖరిలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని తెలిపారు. కేప్‌టౌన్ బాల్ టాంపరింగ్ ఘటన తర్వాత ఆస్ట్రేలియా జట్టును తిరిగి బలోపేతం చేయడంలో కమిన్స్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఈ వివాదం ప్రపంచ క్రికెట్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా కీలక ప్రకటన చేసింది.
2018 దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ వెల్లడించారు.
అయితే, ఎనిమిదేళ్ల క్రితం జరిగిన విచారణను మళ్లీ ప్రారంభించి ఎవరికీ కొత్తగా శిక్షలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. నెల రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం ఏయే వివరాలను బహిరంగంగా వెల్లడించాలనే విషయంపై బోర్డు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
దీంతో ఎనిమిదేళ్ల క్రితం ముగిసిపోయిందనుకున్న బాల్ టాంపరింగ్ వివాదం ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తోంది.

Leave a Reply