నిజం చెప్పలేక కొడుక్కి ‘అక్క’గా మారిన చిన్నారి; ఎవరా బాలిక? ఏమా కథ?

ఆ ‘ఆడపిల్ల’ బాల్యం అందరిలా లేదు. సరిగ్గా లేచి నడవలేని వయసులోనే ఆమె పుష్పవతి అయింది. బడికి వెళ్లే వయసు వచ్చేసరికి గర్భవతి అయి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంత చిన్న వయసులో ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు అనుమానించి, ఆమె తండ్రిని పోలీసులు జైలుకు పంపారు.

తానే జన్మనిచ్చి, అల్లారుముద్దుగా పెంచిన కొడుక్కి “నేను నీ అక్కను” అని అబద్ధం చెబుతూ పెంచి పెద్ద చేసింది. ఇన్ని కష్టాలు ఎదురైనా ఆమె కుంగిపోలేదు. జీవితం విసిరిన సవాళ్లకు భయపడకుండా అందరిలాగే బతికి చూపించింది. ఆడుకోవాల్సిన వయసులో ఒక జీవికి జీవనధారగా నిలిచిన ఆమే పెరూ దేశానికి చెందిన లీనా మెదీనా.

సంఘటన నేపథ్యం: పెరూలోని ఒక చిన్న గ్రామంలో 1933, సెప్టెంబర్ 23న జన్మించిన మెదీనా, తనకు 5 ఏళ్ల 7 నెలల 21 రోజులు ఉన్నప్పుడే తల్లి అయింది. వైద్య చరిత్రలో అత్యంత పిన్న వయసులో తల్లిగా నమోదైన రికార్డు ఈమెదే. మొదట ఆమె కడుపు పెరుగుతుండటంతో ఏదో గడ్డ (Tumor) ఏమో అని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ పరీక్షించిన వైద్యులు ఆమె 7 నెలల గర్భవతి అని తేల్చారు.

ప్రసవం మరియు ‘ప్రికాషియస్ ప్యూబర్టీ’: అంత చిన్న వయసులో సహజ ప్రసవం ప్రాణాపాయం కావడంతో, 1939 మే 14న శస్త్రచికిత్స (సిజేరియన్) ద్వారా ఆమెకు మగబిడ్డ జన్మించాడు. ఆ బాబుకు వైద్యుడు గెరార్డో లోజాడా గౌరవార్థం ‘గెరార్డో’ అని నామకరణం చేశారు. మెదీనాకు ‘ప్రికాషియస్ ప్యూబర్టీ’ అనే ఆరోగ్య సమస్య ఉండటం వల్ల ఆమెకు 3వ ఏటనే నెలసరి ప్రారంభమైందని వైద్యులు గుర్తించారు.

ముగియని మిస్టరీ: లీనా మెదీనా గర్భం దాల్చడానికి కారకులెవరు అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. తండ్రిని అరెస్టు చేసినా సరైన సాక్ష్యాలు లేక విడుదల చేశారు. సమాజానికి భయపడి ఆ బాబుకు మెదీనాను ‘అక్క’గా పరిచయం చేశారు. గెరార్డోకు 10 ఏళ్లు వచ్చినప్పుడు మెదీనా తన అక్క కాదు, తల్లి అనే నిజాన్ని చెప్పారు. గెరార్డో 1979లో తన 40వ ఏట ఎముకల క్యాన్సర్‌తో మరణించాడు.

లీనా మెదీనా తర్వాత 1966లో వివాహం చేసుకుని 1972లో మరో బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్లు. ఆమె పెరూలో ప్రచారానికి దూరంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు.


Posted

in

by

Tags: