బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్‌కు హోం శాఖ శనివారం (ఏప్రిల్ 18) ‘Z’ కేటగిరీ భద్రతను కేటాయించింది. ఈ నిర్ణయంపై ఇప్పుడు రాజకీయ యుద్ధం మొదలైంది. ఆర్జేడీ (RJD) ఈ విషయాన్ని తేజస్వి యాదవ్ భద్రతతో పోల్చగా, కాంగ్రెస్ పార్టీ నిషాంత్‌ను ఉద్దేశించి “మందబుద్ధి పుత్రుడు” అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరిన్ని వివాదాలకు దారితీసేలా కనిపిస్తోంది.
‘భద్రతను దానంగా పంచుతూ హోదా పెంచుకుంటున్నారు’
ఆర్జేడీ ప్రతినిధి శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. “కోటి 90 లక్షల మంది ప్రజల మద్దతు ఉన్న ప్రతిపక్ష నేత, ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌కు ఎన్నిసార్లు విన్నవించినా Z+ భద్రత కల్పించలేదు. కానీ, మరోవైపు సుపరిపాలన అని చెప్పుకునే నితీష్ ప్రభుత్వం.. తన కుమారుడు నిషాంత్‌కు Z కేటగిరీ, శ్రవణ్ కుమార్‌కు Y+ భద్రతను దానంగా పంచుతూ కేవలం తమ వారికి హోదా పెంచుకుంటోంది” అని విమర్శించారు.
అధికార మదంతో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి ప్రభుత్వం చేస్తున్న ఈ పని స్పష్టమైన కుట్ర అని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాల భద్రతతో ఆటలాడుకునే ప్రభుత్వాల ఆయుష్షు ఎక్కువ కాలం ఉండదని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రశ్న: నిషాంత్ ఏ పదవిలో ఉన్నారు?
బీహార్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ స్నేహాశీష్ వర్ధన్ ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ.. “నిషాంత్ కుమార్ ఈ రాష్ట్రానికి ఏమైనా అమూల్యమైన సంపదా? లేక ఏదైనా పెద్ద రాజకీయ, పరిపాలనా పదవిలో ఉన్నారా? ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో ఆయనకు Z కేటగిరీ భద్రత ఎందుకు ఇవ్వాలి?” అని నిలదీశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “ఒక మందబుద్ధి పుత్రుడి రక్షణ కోసం ఇప్పుడు బీహార్ పోలీసులను వినియోగిస్తారా? ఇది రాష్ట్రానికి దురదృష్టం. లేదా బీజేపీ పన్నిన కుట్ర కావొచ్చు. ఈ నేత పుత్రుడు ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా పెట్టడానికే హోం శాఖ ద్వారా ఈ భద్రతను కల్పించినట్లుంది” అని ఆరోపించారు. విజయ్ సిన్హా, శ్రవణ్ కుమార్లపై కూడా నిఘా ఉంచడానికే వారికి భద్రత పేరుతో హడావిడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
