బెంగళూరు: బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు. లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థుల మరణం వెనుక ఉన్న విషయాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
కర్ణాటకలోని డొబ్బాస్పేట్ – హోస్కోట్ రింగ్ రోడ్డుపై రెండు లగ్జరీ కార్లు, ఒక ట్రక్కు మరియు మోటార్ సైకిళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు విద్యార్థులతో సహా మొత్తం ఏడుగురు మరణించారు. శుక్రవారం ఉదయం 5:15 గంటలకు ఈ ఘటన జరిగింది.
తల్లిదండ్రులకు తెలియకుండానే..: పరీక్షలు దగ్గరపడుతుండటంతో తమ పిల్లలు గదిలో చదువుకుంటూ నిద్రపోతున్నారని తల్లిదండ్రులు భావించారు. కానీ, పోలీసుల నుండి “మృతదేహాలను గుర్తించడానికి రండి” అని ఫోన్ కాల్ రావడంతో వారు కుప్పకూలిపోయారు. రాత్రి గదిలో పడుకున్న కొడుకు ఏమయ్యాడో తెలియక గదిలోకి వెళ్లి చూడగా, పడక ఖాళీగా ఉంది. తమకు తెలియకుండానే పిల్లలు బయటకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారని అప్పుడే వారికి తెలిసింది.
ఒక విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. “బయటకు వెళ్లవద్దని ఖచ్చితంగా చెప్పాం. అర్ధరాత్రి కూడా గదిలోకి వెళ్లి చూశాం. కానీ తెల్లవారుజామున లేచి చూసేసరికి కొడుకు కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్లి వస్తాడనుకున్నాం, కానీ పోలీసుల నుండి ఫోన్ వచ్చింది” అని కన్నీరుమున్నీరయ్యారు. అయన్ అనే విద్యార్థి తండ్రి కారునే వీరు తీసుకెళ్లారు. ఆ కారు కొని ఆరు నెలలే అయ్యింది.
ప్రమాదం ఎలా జరిగింది? హోస్కోట్ నుండి దేవనహళ్లి వైపు అతివేగంగా వెళ్తున్న లగ్జరీ కారు మొదట ఒక మోటార్ సైకిల్‌ను, ఆ తర్వాత ట్రక్కును ఢీకొట్టింది. కారు ఢీకొన్న వేగానికి బైక్‌పై వెళ్తున్న గగన్ (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతను నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఆరుగురు కాలేజీ విద్యార్థులు సరదా కోసం బయటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. కారు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యింది.
