చెన్నై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళ భాష గురించి అవమానకరమైన పదాలను ఉపయోగించారని రాజ్యసభలో కమల్ హాసన్ చేసిన విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన నిర్మలమ్మ, కమల్ హాసన్ సభలో తప్పుడు సమాచారాన్ని అందించారని, తాను తమిళం గురించి ఎన్నడూ అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.
రాజ్యసభలో కమల్ హాసన్ ప్రసంగం మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ తమిళనాడు నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికై, నిన్న తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “తమిళం చదివితే భిక్షం ఎత్తుకోవడానికి కూడా పనికిరాదని మీరు అన్నారు. బిచ్చగాడి పాత్రలోని చిల్లర ఆధునిక కాలానికి పనికిరాదని మీకు తెలుసు. మీరు తెల్లవారి విద్యను అభ్యసించిన కర్పూర బుద్ధి గలవారు. ఆ గర్వం గాలిలో కలిసిపోయి చాలా కాలమైంది.”
“తమిళులు భిక్షం ఎత్తుకోరు, ముఖ్యంగా మీ భిక్షను అసలే స్వీకరించరు. ఈ కమల్ హాసన్ ఓటును, దేశాన్ని ఎప్పటికీ అమ్ముకోడు. మీరు మాపై వేసే శాపాలను మేము నమ్మము. మీ విధి మిమ్మల్ని దహిస్తుంది. మా దేశం చిరకాలం వర్ధిల్లుతుంది” అంటూ కమల్ ఆవేశంగా మాట్లాడారు.
నిర్మలా సీతారామన్ వివరణ కమల్ హాసన్ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి తీవ్రంగా ఖండించారు. తాను ఆ మాటలు అనలేదని, గతంలో పెరియార్ (ఈ.వే. రామస్వామి నాయకర్) చేసిన వ్యాఖ్యలను మాత్రమే తాను ఉదహరించానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
“రాజ్యసభలో కమల్ హాసన్ తప్పుడు సమాచారం ఇచ్చారు. మార్చి 2025లో జరిగిన ఒక కార్యక్రమంలో నేను పెరియార్ మాటలను ప్రస్తావించాను తప్ప, అది నా సొంత అభిప్రాయం కాదు. ఒక వార్తా సంస్థ కూడా వాస్తవాలను సరిచూసుకోకుండా దీనిని ప్రసారం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు మరియు నా మాటలను వక్రీకరించినందుకు ఆ సంస్థ తక్షణమే క్షమాపణలు చెప్పాలి” అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
