నీరు ఎంత తాగాలి? రోజుకు ఎన్ని లీటర్లు అవసరం? సైన్స్ ఏం చెబుతోంది?

చర్మ సౌందర్యం నుంచి జీర్ణక్రియ మెరుగుపడటం వరకు నీటి పాత్ర చాలా కీలకమైనది. అయితే, శరీరంలో నీరు తగ్గితే (Dehydration) ఎంత ప్రమాదమో, అవసరానికి మించి నీరు తాగడం (Overhydration) కూడా అంతే సమస్యాత్మకం.

వైద్యులు ఏం చెబుతున్నారు? ప్రతి ఒక్కరికీ సరిపోయేలా ‘ఇంతే నీరు తాగాలి’ అనే ఒక ఖచ్చితమైన కొలత అంటూ ఏమీ లేదు. ఒక వ్యక్తికి ఎంత నీరు అవసరమనేది వారి శారీరక శ్రమ, నివసించే ప్రాంతంలోని వాతావరణం మరియు వారి ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.

  • శరీర నిర్మాణం: మానవ శరీరంలో 50 నుండి 70 శాతం వరకు నీరే ఉంటుంది. అవయవాలన్నీ సరిగ్గా పనిచేయడానికి నీరు చాలా అవసరం.
  • సాధారణ పరిమితి: సాధారణంగా పెద్దలకు రోజుకు 2 నుండి 2.5 లీటర్ల నీరు సిఫార్సు చేయబడింది.
  • లింగ భేదం: సగటున పురుషులకు రోజుకు 3.7 లీటర్లు, మహిళలకు 2.7 లీటర్ల ద్రవ పదార్థాలు (నీరు + ఇతర పానీయాలు + ఆహారం ద్వారా వచ్చే నీరు) అవసరమని సూచించబడింది. మనకు అందే నీటిలో 20% పండ్లు, కూరగాయల ద్వారా లభిస్తుంది.

మీరు తగినంత నీరు తాగుతున్నారని ఎలా తెలుసుకోవాలి? లీటర్ల లెక్కలు వేసుకునే కంటే మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు:

  1. దాహం: మీకు తరచుగా దాహం వేయకపోవడం.
  2. మూత్రం రంగు: మీ మూత్రం లేత పసుపు రంగులో లేదా రంగు లేకుండా స్పష్టంగా ఉంటే మీరు తగినంత నీరు తాగుతున్నారని అర్థం.

ఎప్పుడు ప్రమాదకరం? అతిగా నీరు తాగడం వల్ల రక్తంలోని సోడియం స్థాయిలు పడిపోతాయి (Hyponatremia). ముఖ్యంగా గుండె లేదా మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా నీరు ఎక్కువగా తాగకూడదు. దీనివల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరడం (Pulmonary Edema) వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు.


Posted

in

by

Tags: