మెక్సికోకు చెందిన 17 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఏంజెలా వెనెగాస్ హెర్నాండెజ్, ధ్వని తరంగాలను (Sound waves) ఉపయోగించి మంటలను ఆర్పే సరికొత్త పరికరాన్ని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.
మెక్సికోలోని తమోలిపాస్ ప్రావిన్స్‌లోని అల్తామీరా ప్రాంతానికి చెందిన ఈమెకు, చిన్నప్పటి నుంచే సైన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాలపై మక్కువ ఎక్కువ. నీరు లేదా రసాయనాలను ఉపయోగించకుండా కేవలం ధ్వని ద్వారా మంటలను ఆర్పేలా ఈ పరికరాన్ని ఆమె రూపొందించింది.
ఈ పరికరంలో 12 వోల్ట్ బ్యాటరీ, ఫ్రీక్వెన్సీ జనరేటర్, యాంప్లిఫైయర్ మరియు లౌడ్ స్పీకర్ వంటి భాగాలు ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ జనరేటర్ సెకనుకు 30 విద్యుత్ పల్స్‌లను (Electrical pulses) ఉత్పత్తి చేస్తుంది. అవి ధ్వని తరంగాలుగా మారి, వృత్తాకారంలో ఉన్న గొట్టం ద్వారా అత్యంత వేగంగా బయటకు వస్తాయి. దీని ద్వారా ఏర్పడే ధ్వని తరంగాలు చిన్న సుడిగుండాల (vortex rings) రూపంలో మారి, మంటలు మండుతున్న ప్రాంతంలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగిస్తాయి. దీంతో దహన ప్రక్రియ నిలిచిపోయి, మంటలు ఆరిపోవడానికి సహాయపడుతుంది.
ఈ పరికరాన్ని రూపొందించడానికి తనకు ఏడాది సమయం పట్టిందని ఏంజెలా తెలిపింది. ఆమెకు సలహాదారుగా మరియు మామయ్య అయిన జోస్ ఆర్టురో నిరంతరం ప్రోత్సాహం అందించారు. ఈ పరికరాన్ని ఏంజెలా ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించింది. గత 14 నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఆ ప్రదర్శనలో, ఆమె ఆవిష్కరణకు బంగారు పతకం వరించింది. ఇంతకు ముందు కూడా మెక్సికోలో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను ఆమె సొంతం చేసుకుంది.
ఈ ఆవిష్కరణ, అమెరికాకు చెందిన డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (DARPA) ఇప్పటికే అభివృద్ధి చేసిన ధ్వని ఆధారిత ప్రయోగాత్మక పరికరం పనితీరు ఆధారంగా రూపొందించినట్లు ఏంజెలా తెలిపింది. ఆ సాంకేతిక భావనను మోడల్‌గా (నమూనాగా) తీసుకుని తన పరికరాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొంది. చిన్న వయసులోనే సైన్స్‌పై ఆసక్తితో సరికొత్త ప్రయోగం చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏంజెలా ఆవిష్కరణ ప్రస్తుతం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Reply