నీళ్ల కోసం బోరు వేస్తే.. వంట గ్యాస్ వచ్చింది! ఆనందంలో కుటుంబం, హెచ్చరిస్తున్న నిపుణులు; వీడియో వైరల్

వంటగ్యాస్ ధరలు సామాన్యులకు భారమవుతున్న ఈ రోజుల్లో, తన ఇంటి ముంగిట లభించే ఉచిత గ్యాస్‌తో వంట చేసుకుంటున్న ఒక కుటుంబం వార్త అస్సాంలోని జోర్హాట్ నుండి వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ‘అదృష్టం’ ఏ క్షణమైనా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీళ్ల కోసం వేసిన బోరుబావి జోర్హాట్ లోని నా-అలి ధేకియాజులి కహార్ గ్రామానికి చెందిన జితు గొగోయ్ అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. సుమారు 14 నెలల క్రితం తన స్థలంలో తాగునీటి కోసం ఆయన బోరుబావి (Borewell) వేయడానికి ప్రయత్నించాడు. అయితే, నిర్ణీత లోతు వరకు తవ్వినా నీళ్లు రాలేదు. దానికి బదులుగా పైపు నుండి గాలి తీవ్రంగా బయటకు రావడం మొదలైంది. దానిని పరీక్షించగా అది త్వరగా నిప్పంటుకునే ప్రకితి సిద్ధమైన వాయువు (Natural Gas) అని తేలింది.

వంట కోసం వినియోగం మొదట్లో ఆశ్చర్యపోయిన జితు కుటుంబం, ఆ తర్వాత ఆ వాయువును రోజువారీ వంట కోసం ఉపయోగించడం ప్రారంభించింది. గత ఏడాది కాలంగా వీరు ఎల్‌పీజీ సిలిండర్లు కొనడం లేదు. ఎటువంటి రెగ్యులేటర్లు లేదా భద్రతా వాల్వ్‌లు లేకుండానే, బోరుబావి పైపును నేరుగా పొయ్యికి కనెక్ట్ చేసి వాడుతున్నారు. అగ్గిపెట్టె వెలిగించగానే గ్యాస్ మండుతుంది. వంట పూర్తయ్యాక దానంతట అదే ఆరిపోతుంది. గ్యాస్ బయటకు రాకుండా పైపు నోటిని రాళ్లు, మట్టితో మూసివేస్తున్నారు. ఇంటి వంటతో పాటు పశువుల దాణా వండటానికి కూడా ఈ గ్యాస్‌నే వాడుతున్నారు.

హెచ్చరిస్తున్న నిపుణులు ఉచితంగా ఇంధనం లభించడం ఉపశమనంగా అనిపించినప్పటికీ, దీని వెనుక భయంకరమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వాయు పీడనాన్ని (Pressure) నియంత్రించే వ్యవస్థలు లేకపోవడం వల్ల, భూగర్భంలోని ఒత్తిడిలో వచ్చే చిన్న మార్పు కూడా భారీ పేలుడుకు దారితీయవచ్చు. శుద్ధి చేయని ఈ వాయువులోని విషపూరిత మూలకాలు శ్వాసించడం వల్ల తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ లీకేజీపై అవగాహన లేకపోవడం వల్ల ఆ కుటుంబమే కాకుండా, ఆ ప్రాంతం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: