కార్పొరేట్ పని సంస్కృతిలో సానుభూతి, మానవత్వం ఎంతలా కరువయ్యాయో తెలియజేస్తూ Redditలో వచ్చిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. భారతీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల పట్ల ఉన్న కఠిన వైఖరిపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
r/IndianWorkplace ఫోరమ్‌లో షేర్ చేయబడిన ఈ పోస్ట్ ప్రకారం.. ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులో సీనియర్ హోదాలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని జీవితంలో జరిగిన ఘటన ఇది. ఆమె తల్లికి మందుల విషయంలో జరిగిన పొరపాటు వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఈ అత్యవసర పరిస్థితుల్లో తన తల్లిని దగ్గరుండి చూసుకోవడానికి ఆమె కొన్ని రోజులు సెలవు కావాలని మేనేజర్‌ను కోరింది. ఆమె ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అడగలేదని, కేవలం కుటుంబ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి కొంత సమయం మాత్రమే అడిగిందని సదరు పోస్ట్ పేర్కొంది.
మేనేజర్ అమానవీయ ప్రవర్తన
అయితే, ఆ మేనేజర్ ఇచ్చిన సమాధానం విని అందరూ నివ్వెరపోయారు. “ఒకవేళ మీ తల్లి కోలుకోకపోతే, ఆమెను ఏదైనా మెడికల్ హోమ్ లేదా అనాథాశ్రమంలో (Shelter Home) పడేసి.. వచ్చి ఆఫీసు పని చూసుకో” అంటూ ఆ మేనేజర్ అత్యంత దారుణంగా మాట్లాడాడు. ఆ మహిళను తన ఉద్యోగం లేదా తన తల్లి.. ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆ పోస్ట్‌లో వివరించారు.
రాజీనామా చేసిన ఉద్యోగిని
ఆ మేనేజర్ మాటలతో తీవ్రంగా కలత చెందిన ఆ మహిళ, తన తల్లి సంరక్షణకే మొగ్గు చూపింది. ఆ సంస్థలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పటికీ, ఆ దారుణమైన వాతావరణంలో ఉండలేక ఆమె వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటనను చూసిన తోటి ఉద్యోగి.. ఇలాంటి పని ప్రదేశాలలో ఎలా స్పందించాలో అర్థం కాక, నెటిజన్ల అభిప్రాయాలను కోరుతూ ఈ పోస్ట్ పెట్టాడు.
నెటిజన్ల ఆగ్రహం
ఈ పోస్ట్ చూసిన వేలాది మంది నెటిజన్లు ఆ మేనేజర్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. “కనీస మానవత్వం లేని ఇలాంటి వ్యక్తులు మేనేజర్లుగా ఉండటం సిగ్గుచేటు” అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఇలాంటి పరిస్థితుల్లో సెలవు నిరాకరిస్తే.. ఆ ఆదేశాలను లిఖితపూర్వక (Written) రూపంలో అడగాలని సూచించారు. కార్పొరేట్ కంపెనీలు కేవలం లాభాలు, టార్గెట్లకే ప్రాధాన్యత ఇస్తూ, మనుషుల భావోద్వేగాలను విస్మరిస్తున్నాయని ఈ చర్చ ద్వారా వెల్లడవుతోంది.
