కేరళలోని కొల్లాం ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి.. తన భార్య ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి, పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసిన నేరానికి గాను పోలీసుల చేతికి చిక్కాడు.
గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లో నివసిస్తున్న ఈ దంపతుల మధ్య జరిగిన వ్యక్తిగత దృశ్యాలను, భార్యకు తెలియకుండా రహస్యంగా వీడియోలు తీసి.. డబ్బు సంపాదించేందుకు అశ్లీల వెబ్‌సైట్లకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
బ్రిటన్‌లో ఉన్న సమయంలో భార్య స్నేహితులు ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో చూసి ఆమెకు సమాచారం అందించారు. అంతేకాకుండా, సదరు భర్త తన భార్యను ఇతర వ్యక్తులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో భర్తలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ దంపతులు కేరళకు తిరిగి వచ్చారు. అక్కడ అతనికి కౌన్సెలింగ్ ఇప్పించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చేరింది.
ఈ అరాచకాలు చాలవన్నట్లు, ఆ వ్యక్తి తన 4 ఏళ్ల చిన్నారి కూతురి ముందే అసభ్యకర చర్యలకు పాల్పడేవాడని ఆసుపత్రి నుంచే భార్య పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో, పోలీసులు అతనిపై కఠిన సెక్షన్లతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. భార్యపై దాడి చేసి పరారీలో ఉన్న నిందితుడిని, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా కొట్టియం పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు.

Leave a Reply