విపరీతంగా మద్యం సేవించి, అపస్మారక స్థితిలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలిని ఒక క్యాబ్ డ్రైవర్ ఎంతో నిబ్బరంగా, బాధ్యతాయుతంగా గమ్యస్థానానికి చేర్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని ప్రవర్తనకు నెటిజన్ల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం జరిగింది?: క్యాబ్‌లోని డ్యాష్‌క్యామ్ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాల్లో, సదరు మహిళ కారు ఎక్కిన వెంటనే తను క్షేమంగా ఇంటికి చేరుకోవడానికి సహాయం చేయమని డ్రైవర్‌ను కోరడం కనిపిస్తుంది. ఆమె పరిస్థితిని గమనించిన డ్రైవర్, ఆమెను ప్రశాంతంగా ఉండమని కోరుతూ, క్షేమంగా చేరుస్తానని భరోసా ఇచ్చాడు.
ప్రయాణంలో ఆ మహిళ తన తల్లికి ఫోన్ చేసి, తాను ఇంటికి వస్తున్నట్లు చెప్పింది. అప్పుడు డ్రైవర్ స్వయంగా ఆమె తల్లితో మాట్లాడి, తమ ‘లైవ్ లొకేషన్’ (Live Location) తెలియజేసి, మీ అమ్మాయిని సురక్షితంగా ఇంటి వద్ద దించుతానని హామీ ఇచ్చాడు. ఫోన్ పెట్టిన తర్వాత, తాను తాగి ఇంటికి వెళ్తున్నందుకు తన తల్లి కొడతారేమో అని ఆ మహిళ ఆందోళన చెందింది. దానికి డ్రైవర్ స్పందిస్తూ.. “నువ్వు గారాబం పెరిగిన దానివి (Spoiled brat), నీకు దెబ్బలు పడాల్సిందే” అని చమత్కరించాడు. ఆమె కూడా నవ్వుతూ అది నిజమేనని ఒప్పుకుంది.
సురక్షితమైన గమ్యం: ఆమె ఇంటికి చేరుకున్నాక, డ్రైవర్ స్వయంగా కారు తలుపు తీసి, నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు సహాయం చేస్తూ సురక్షితంగా ఇంట్లోకి పంపాడు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆమెను చేర్చినందుకు నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, సదరు మహిళ ఆ వీడియోను తొలగించమని డ్రైవర్‌ను కోరినట్లు సమాచారం.
