మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో పోలీస్ శాఖను తలదించుకునేలా చేసిన ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రక్షక భట నిలయంలోనే ఒక అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) భక్షకుడిలా ప్రవర్తించాడు. లాకప్‌లో ఉన్న ఒక మహిళా ఖైదీకి తన కూతురిని అప్పగిస్తే డబ్బులిస్తానంటూ ఒక నీచమైన ప్రతిపాదనను పెట్టాడు. ఈ విషయం బయటకు రావడంతో పోలీస్ విభాగంలో తీవ్ర కలకలం రేగింది.
ఏమిటా సిగ్గుమాలిన ఘటన? ఈ ఘటన అకోలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో జరిగింది. సుమారు ₹80 లక్షల మోసం కేసులో ఒక మహిళను అరెస్ట్ చేసి లాకప్‌లో ఉంచారు. అక్కడ డ్యూటీలో ఉన్న 54 ఏళ్ల ఏఎస్ఐ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ మహిళతో మాట్లాడుతూ.. “నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ కూతురు కూడా కచ్చితంగా అందంగానే ఉంటుంది. ఆమెను నా దగ్గరికి పంపించు, అందుకు బదులుగా నీకు ₹10,000 ఇస్తాను” అని అసభ్యంగా ప్రేలాపనలు చేశాడు.
ధైర్యం చూపి గుట్టు రట్టు చేసిన మహిళ: సదరు ఏఎస్ఐ పెట్టిన అవమానకరమైన ప్రతిపాదనకు లొంగిపోకుండా, ఆ మహిళా ఖైదీ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. బాధితురాలి ఫిర్యాదును జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) తీవ్రంగా పరిగణించి, ఆ ఏఎస్ఐని తక్షణమే సస్పెండ్ (నెలవు నుంచి తొలగింపు) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కేసు నమోదు కావడంతో పరార్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మరియు పదవిని దుర్వినియోగం చేయడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదైంది. అయితే, సస్పెన్షన్ వార్త వినగానే ఆ ఏఎస్ఐ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. నిందితుడి గత రికార్డును పరిశీలించగా, 10 ఏళ్ల క్రితం కూడా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయని తేలింది.
మహిళా కమిషన్ సీరియస్: ఈ ఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జాతీయ మహిళా కమిషన్ (NCW) ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. మహారాష్ట్ర పోలీసుల నుండి సమగ్ర నివేదిక కోరడంతో పాటు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేసింది. విచారణ నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
