“నువ్వే దొంగతనం చేశావా?” అంటూ మహిళను చుట్టుముట్టిన గుంపు.. ఆపై దారుణంగా దాడి! జుట్టు పట్టుకుని కిందపడేసి చితకబాదిన వైనం.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!

బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఛత్ పండుగ సందర్భంగా దొంగతనానికి ప్రయత్నించిందనే అనుమానంతో ఓ మహిళపై కొందరు స్థానికులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహిళను చెంపదెబ్బలు కొడుతూ, జుట్టు పట్టుకుని కిందకు లాగి దారుణంగా కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తల్సింగ్‌సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్-జలాల్‌పూర్ గ్రామంలో ఉన్న చక్ దేవి చెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛత్ పండుగ సందర్భంగా పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ, కొందరి బంగారు గొలుసులను దొంగిలించేందుకు ప్రయత్నించిందని అక్కడున్నవారు ఆరోపించారు.

ఈ అనుమానంతో కొందరు ఆమెను చుట్టుముట్టి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆగ్రహానికి గురైన కొంతమంది ఆమెపై దాడికి దిగినట్లు సమాచారం. ఆమెను పదేపదే చెంపదెబ్బలు కొట్టడంతో పాటు, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కిందపడేసి విచక్షణారహితంగా దాడి చేశారు.

అక్కడున్న కొందరు ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, చాలామంది మాత్రం చూస్తూ ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈ ఘటనపై తల్సింగ్‌సరాయ్ డీఎస్పీ వివేక్ శర్మ స్పందిస్తూ.. పోలీసులు తనిఖీ చేసినప్పుడు ఆ మహిళ వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, దొంగిలించిన బంగారు గొలుసు గానీ లభించలేదని తెలిపారు.

కేవలం అనుమానం ఆధారంగా ఎవరినీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేసే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. బాధిత మహిళ నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు లేదా వాంగ్మూలం అందిన తర్వాత దాడికి పాల్పడిన వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *