తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, కోతిరాంపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘటన సమాజం మొత్తాన్ని తీవ్రంగా కలచివేసింది.
సొంత ఇల్లు ఖాళీ చేయాలంటూ కన్న కొడుకు పెడుతున్న వేధింపులు తాళలేక, వృద్ధ దంపతులు తమ ఇంటి ముందే నిరసనకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
జమ్మికుంట మండలానికి చెందిన దేవుపల్లి లక్ష్మణ్ 2010లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రవికుమార్ హైదరాబాద్లో ప్రముఖ ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేస్తూ నెలకు సుమారు రూ. 8 లక్షలకు పైగా ఆర్జిస్తున్నాడు.
గత 2002లో లక్ష్మణ్ తన సొంత సంపాదనతో ఆ ఇంటిని నిర్మించారు. ఆ తర్వాత కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమతో 2010లో ఆ ఇంటిని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అయితే, ఆ కొడుకు కనికరం లేకుండా 2023 నుంచి తల్లిదండ్రులను ఆ ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు.
ప్రస్తుతం ఆ ఇంటి నుంచి వచ్చే అద్దె ఆదాయంతోనే ఆ వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు. “ఈ పండుటాకు వయసులో మమ్మల్ని ఇంటి నుంచి వెళ్లిపోమంటే మేమెక్కడికి వెళ్లాలి?” అంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అంతేకాకుండా, లక్ష్మణ్ భార్య జయలక్ష్మి తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కన్నకొడుకు అమానుషంగా ప్రవర్తించడంతో ఆ వృద్ధ దంపతులు మానసికంగా కుంగిపోయారు.
“మా ఇల్లు మాకు కావాలి, ఈ వృద్ధాప్యంలో మాకు రక్షణ కల్పించాలి” అని ఆ వృద్ధ దంపతులు అధికారుల ముందు రోదిస్తూ విజ్ఞప్తి చేశారు. గతంలో కుమారుడి పేరిట చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నెలకు లక్షల్లో సంపాదిస్తూ కన్నవారిని నడిరోడ్డున నిలబెట్టిన కొడుకు తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply