నేత చీరలో అమ్మ, గొంగడితో నాన్న.. ఐపిఎస్ కొడుకుతో కలిసి మొదటిసారి విమాన ప్రయాణం!

సాధారణ గ్రామీణ జీవితం గడిపే వారికి విమానాన్ని దగ్గరగా చూడటమే ఒక వింత. అలాంటిది నేరుగా విమానంలో ప్రయాణించే అవకాశం వస్తే అది ఒక కల నిజమైనట్లే. కొడుకు తన తల్లిదండ్రులను హెలికాప్టర్ లేదా విమానంలో తీసుకెళ్లినప్పుడు వారు పొందే ఆనందం వర్ణనాతీతం. ఆకాశంలో వెళ్లే విమానం వైపు తల ఎత్తి చూసే పిల్లలు, పెరిగి పెద్దయ్యాక అదే విమానంలో తల్లిదండ్రులను కూర్చోబెట్టినప్పుడు అది గర్వించదగ్గ క్షణం అవుతుంది.

యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఐపిఎస్ అధికారి కావాలనే తన కలను నెరవేర్చుకున్న ఒక గొర్రెల కాపరి కుమారుడు బీర్‌దేవ్ డోణే. ఆయన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. మహారాష్ట్ర ప్రజలు ఆయన్ను గుండెలకు హత్తుకున్నారు.

ప్రస్తుతం బీర్‌దేవ్ డోణే తన శిక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు తన కుటుంబాన్ని ఆహ్వానించారు. ఇందుకోసం ఆయన తన తల్లిదండ్రులతో కలిసి విమానంలో ప్రయాణించారు. తన తల్లిదండ్రులకు ఈ మొదటి విమాన ప్రయాణ అనుభవాన్ని అందించిన ఆనందాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

“విమానాన్ని చూడాలని కలలు కన్న స్థాయి నుండి, నా కుటుంబం విమానం మెట్లు ఎక్కే వరకు సాగిన ఈ ప్రయాణం.. ఈ క్షణం మాటలకు అతీతం. ఇది విలాసం కాదు, నా పరిస్థితి కూడా కాదు.. కేవలం కృతజ్ఞత మాత్రమే. వారి చిరునవ్వే నా విజయం” అని బీర్‌దేవ్ డోణే ఉద్వేగానికి లోనయ్యారు.

బీర్‌దేవ్ డోణే ప్రస్తుతం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ శిక్షణ పొందుతున్నారు. తన తల్లిదండ్రులను అకాడమీకి తీసుకువచ్చే క్రమంలో వారు మొదటిసారి ఇండిగో విమానంలో ప్రయాణించారు. సాంప్రదాయ నవవారీ చీరలో ఉన్న తల్లి, భుజంపై గొంగడి ధరించిన తండ్రి ఆ విమాన ప్రయాణంలో అందరి దృష్టిని ఆకర్షించారు.


Posted

in

by

Tags: