“నేను అమ్మను చంపేశా..!” రుబ్బురోలుతో తలపై బలంగా బాది.. కన్నతల్లినే చంపి వాట్సాప్‌లో ఫోటో తీసి పోలీస్ అన్నకు పంపిన తమ్ముడు.. వణికిపోయిన తిరుచెందూర్..!

“కన్నతల్లిని మించిన దైవం లేదు” అంటారు. కానీ, స్వయంగా కన్నకొడుకే కసాయిలా మారి తల్లిని పొట్టనబెట్టుకున్న దారుణ ఘటన తిరుచెందూర్ సమీపంలో వెలుగుచూసింది.

రిటైర్డ్ ప్రొఫెసర్‌గా పనిచేసిన వృద్ధురాలిని ఆమె కన్నకొడుకే ఇంట్లోని రుబ్బురోలుతో కొట్టి దారుణంగా హత్య చేయడమే కాకుండా.. రక్తపు మడుగులో ఉన్న మృతదేహం ఫోటోను వాట్సాప్‌లో పంపించిన ఉదంతం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

తిరుచెందూర్ సమీప ప్రాంతానికి చెందిన అన్బుమణి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు. ఆయన భార్య రేణుక (62) ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చెన్నైలో పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తుండగా, చిన్న కుమారుడు తంగబాలన్ (27) మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతడు గత మూడేళ్లుగా చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

సంఘటన జరిగిన రోజున తండ్రి అన్బుమణి కులదైవ దర్శనం కోసం గుడికి వెళ్లారు. దీంతో ఇంట్లో రేణుక, చిన్న కుమారుడు తంగబాలన్ మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా తల్లికొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. మానసిక క్షోభ, విపరీతమైన కోపంతో ఊగిపోయిన తంగబాలన్.. కనిపెంచిన తల్లి అని కూడా చూడకుండా వంటింట్లోని రుబ్బురోలు రాయిని తెచ్చి రేణుక తలపై విచక్షణారహితంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

తల్లిని కిరాతకంగా చంపడమే కాకుండా, తాను చేసిన ఘోరాన్ని చెన్నైలో పోలీసుగా పనిచేస్తున్న తన అన్నయ్యకు నిరూపించేందుకు.. చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఫోటో తీసి వాట్సాప్‌లో పంపించాడు. ఆ భయానక ఫోటోను చూసి హడలిపోయిన పెద్ద కుమారుడు కన్నీరుమున్నీరవుతూ వెంటనే తిరుచెందూర్ పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మెరుపువేగంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న తల్లి శవం పక్కనే ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కూర్చుని ఉన్న తంగబాలన్‌ను చూసి పోలీసులు నివ్వెరపోయారు. వెంటనే రేణుక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుచెందూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం హంతకుడైన తంగబాలన్‌ను అరెస్ట్ చేసి, అతడిని పోలీసు భద్రత నడుమ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పట్టపగలే జరిగిన ఈ దారుణ హత్య తిరుచెందూర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *