రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా, జెక్మాబాద్ గ్రామానికి చెందిన కన్హారామ్ బైర్వా అనే బాలుడు ఒక వింత వాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తన గత జన్మలో తాను ఆమేర్ సంస్థానాధీశుడు ‘రాజా మాన్‌సింగ్’ అని ఆ బాలుడు చెబుతున్నాడు.
ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న కన్హారామ్.. తాను గత జన్మలో రాజపుత్ర రాజునని, ఆమేర్ కోటలోని ‘శిలా దేవి’ తమ కులదైవమని అంటున్నాడు. అంతేకాకుండా, హల్దీఘాటి యుద్ధంలో తాను మహారాణా ప్రతాప్ చేతిలో ఓడిపోయానని, ఆ సమయంలో యుద్ధంలో లభించిన సంపదను (నిధిని) ఆమేర్ రాజభవనాల్లో దాచిపెట్టానని ఈ బాలుడు క్లెయిమ్ చేస్తున్నాడు.
కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
కన్హారామ్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అతడు జెక్మాబాద్‌లోని ఒక సాధారణ బైర్వా కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లి గ్యార్సీ దేవి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి తమ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి కన్హారామ్ నిరాకరించేవాడని, ‘నేను ఈ ఇంట్లో ఆహారం తినలేను’ అని చెప్పేవాడని వెల్లడించారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ, తన గత జన్మకు సంబంధించిన మరిన్ని వివరాలను అతడు చెప్పడం ప్రారంభించాడు.
నిధి గురించి వాదనలు:
ఆమేర్ కోటలోని శిలా దేవి ఆలయాన్ని తాను సందర్శించానని, అక్కడ తాను దాచిన నిధి ఇంకా అలాగే ఉందని ఆ బాలుడు చెబుతున్నాడు. తన గత జన్మలో అనేక యుద్ధాలు చేశానని, ఆమేర్ కోట నిర్మాణంలో కూడా తన పాత్ర ఉందని అంటున్నాడు. అంతేకాదు, శిలా దేవి ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని తాను బెంగాల్ నుండి తీసుకువచ్చానని కన్హారామ్ వివరించాడు.
