ఫ్రాన్స్: బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసిన తన మాజీ ప్రియుడు, ఏడేళ్లపాటు తనను మోసం చేసి దారుణమైన హింసకు గురిచేశాడని 42 ఏళ్ల మహిళ కోర్టులో కన్నీరుమున్నీరవుతూ వాంగ్మూలం ఇచ్చింది.
లేటిసియా ఆర్ (Laetitia R) అనే ఆ మహిళ, తన ప్రియుడు గిల్లూమ్ బుచ్చి (Guillaume Bucci) తనను శారీరకంగా, మానసికకంగా చిత్రహింసలకు గురిచేశాడని తెలిపింది. 2015 నుండి 2022 వరకు జరిగిన ఈ దారుణాల్లో, మొదట చిన్నపాటి లైంగిక చేష్టలుగా అనిపించినవి ఆ తర్వాత క్రూరమైన హింసగా మారాయని ఆమె పేర్కొంది. తన వద్ద ఉన్న ప్రైవేట్ వీడియోలను బహిర్గతం చేస్తాడని భయపడి తాను మౌనంగా ఉన్నానని ఆమె చెప్పింది.
నిందితుడు ఆమెను తన స్నేహితులు, సహోద్యోగులు మరియు అపరిచితులకు అమ్మేవాడు. ఆమె ఎవరితో శృంగారంలో పాల్గొనాలో కూడా అతనే నిర్ణయించేవాడు. ఆమె 487 మంది పురుషులతో బలవంతంగా శృంగారంలో పాల్గొనాల్సి వచ్చిందని, కొందరిని పది సార్లు కంటే ఎక్కువగా కలిశానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 2015 క్రిస్మస్ రోజున హైవేపై ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అపరిచితులకు తనను అప్పగించినప్పుడు, లోపల తాను చనిపోయానని అనుకున్నానని ఆమె కోర్టులో చెప్పడం అందరినీ కలచివేసింది.
నిందితుడు గిల్లూమ్ బుచ్చి తన నేరాన్ని అంగీకరించాడు కానీ, అవన్నీ ‘సెక్స్ గేమ్స్’ అని బుకాయించాడు. అయితే, కోర్టు అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జిసెల్ పెలికోట్ అనే మహిళ తన భర్త వల్ల ఎదుర్కొన్న దారుణమైన కేసు నుండి పొందిన ధైర్యంతోనే లేటిసియా ఇప్పుడు బయటపడి తన కథను చెప్పగలిగింది.
