మదురై సెంట్రల్ నియోజకవర్గానికి నేను సంబంధం లేని అభ్యర్థినా? మరి తూత్తుకుడి పార్లమెంట్ నియోజకవర్గంలో కనిమొళి పోటీ చేసినప్పుడు ఆమె అక్కడి వారా? అని దర్శకుడు సుందర్ సి ప్రశ్నించారు.
మదురై సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా జస్టిస్ పార్టీ తరపున సుందర్ సి బరిలోకి దిగారు. ఆయన అన్నాడీఎంకే యొక్క ‘రెండాకుల’ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఈ రోజు తన భార్య కుష్బూతో కలిసి సుందర్ సి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
“రాబోయే ఎన్నికల్లో మా విజయం ఖాయమని నమ్మకం కలిగింది. ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి మదురై ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గత 10 ఏళ్లుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే (పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్) ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు. ప్రజలు మేడలు, మిద్దెలు అడగడం లేదు; స్వచ్ఛమైన తాగునీరు, మంచి రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారాన్ని మాత్రమే కోరుతున్నారు.”
కనిమొళి విమర్శలపై కౌంటర్: “నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టి పీటీఆర్ విజయాన్ని విపక్షాలు ఖాయం చేశాయి” అని కనిమొళి చేసిన వ్యామర్శలపై సుందర్ సి తీవ్రంగా స్పందించారు.
“ఆమె తూత్తుకుడిలో పోటీ చేశారు కదా, ఆమె అక్కడి వారా? ఆమె చెన్నైకి చెందిన వారు. నామినేషన్ వేసేటప్పుడే ఆమె తూత్తుకుడికి వచ్చారు. ఆమెకో న్యాయం, నాకో న్యాయమా? మంచి చేయాలనుకుంటే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. మదురై ప్రజలు చెడు చేసే వారికి కూడా మంచి చేస్తారు, అలాంటిది నేను మంచి చేయడానికి వచ్చాను. ఇకపై నేను మదురై వాడినే. ఇక్కడే ఇల్లు కూడా చూసుకున్నాను. నెలకు 15 రోజులు ఇక్కడే ఉంటాను” అని చెప్పారు.
తమ మూలాల గురించి వివరిస్తూ.. “నా సొంత ఊరు పళని, పెరిగింది కోయంబత్తూరులో, మా అమ్మది తిరుచ్చి, బతుకుదెరువు చెన్నైలో.. ఇప్పుడు చెప్పండి నేను ఏ ఊరి వాడిని? నేను తమిళనాడు వాడిని, మదురై కూడా తమిళనాడులోనే ఉంది కదా” అని ఆయన ప్రశ్నించారు.
