ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ ప్లాజాలోకి సెప్టెంబర్ 7న రోహన్ ప్రేమల్ పరేఖ్ (24) అనే యువకుడు తన సాయుధ అంగరక్షకులతో కలిసి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
అక్కడి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోగా, తాము ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారులమని చెప్పుకుంటూ ఒక నకిలీ గుర్తింపు కార్డును చూపించి లోపలికి వెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న బీకేసీ మరియు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా రోహన్ పరేఖ్, అతని భద్రతా సిబ్బంది దిలీప్ రాజారామ్ గుండే (49)లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లైసెన్స్ ఉన్న రివాల్వర్, 6 సజీవ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ఇద్దరినీ ఎస్ప్లనేడ్ కోర్టులో హాజరుపరచగా, వారిని సెప్టెంబర్ 11 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశించింది. కాగా, ఈ వ్యవహారంలో ప్రమేయమున్న ప్రథమేష్ గణేష్ బాగుల్ అనే మూడో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్వాధీనం చేసుకున్న నకిలీ ఐడీ కార్డుపై దాన్ని జారీ చేసిన అధికారి హోదా కానీ, గడువు ముగిసే తేదీ (Expiry date) కానీ లేకపోవడంతో.. ఆల్మారాటం (ఇంపర్సనేషన్), ఫోర్జరీ, మోసం తదితర భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
కోర్టు విచారణ సందర్భంగా రోహన్ పరేఖ్ న్యాయవాది వాదిస్తూ, తన క్లయింటే స్వయంగా మోసపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. తరుణ్ కపూర్ అనే వ్యక్తి రోహన్కు పీఎంవో కార్యాలయంలో సలహాదారు (అడ్వైజర్) పదవి ఇప్పిస్తానని చెప్పి నకిలీ ఈమెయిళ్లు, ఐడీ కార్డు స్క్రీన్షాట్లను పంపి మోసం చేశాడని తెలిపారు. అంతేకాకుండా, కాబోయే భార్య కోసం పెర్ఫ్యూమ్ కొనడానికే రోహన్ ఆ మాల్కి వెళ్లాడని, ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. అయినప్పటికీ, దీని వెనుక ఉన్న అసలు కారణాలను నిగ్గుతేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.
