‘నేను పూజను చంపేశాను’, లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రియుడు.. కారణం వింటే షాక్!

హర్యానాలోని హిసార్‌లో బంధాలను కుదిపేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. గత ఐదేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న ఒక మహిళను, ఆమె ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.

ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత, నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, “నేను పూజను చంపేశాను. ఆమె మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది” అని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులు వెంటనే నిందితుడిని తీసుకుని సూర్య నగర్‌లోని అతడి ఇంటికి వెళ్లారు. అక్కడ గదిలో 32 ఏళ్ల పూజ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని సీజ్ చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు.

పూర్వాపరాలివే.. ప్రాథమిక విచారణలో మృతురాలు పూజకు ఇప్పటికే రెండు వివాహాలు జరిగాయని, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తేలింది. రెండో వివాహం విడాకులతో ముగియడంతో, గత ఐదేళ్లుగా ఆమె గౌరవ్ అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటోంది.

పోలీసుల కథనం ప్రకారం, గురువారం ఉదయం 10 గంటల సమయంలో పొరుగువారు ఈ ఘటనను గుర్తించి సమాచారం అందించారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పూజ మరియు గౌరవ్‌ల మధ్య వాగ్వాదం జరిగిందని, అది ముదిరి గౌరవ్ కత్తితో పూజపై దాడి చేశాడని తెలుస్తోంది. ఆమె గొంతు, కడుపు, వీపుపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మరణించింది.

నిందితుడి వాదన.. పోలీసుల విచారణలో, పూజ గత 5-6 నెలలుగా మరో వ్యక్తితో పరిచయం పెంచుకుందని గౌరవ్ ఆరోపించాడు. దీనిపైనే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. అయితే, నిందితుడి వాదనలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మరోవైపు, మృతురాలి తల్లి సంగీత మాట్లాడుతూ, గౌరవ్ తన కుమార్తెను తప్పుదోవ పట్టించాడని, అతను అక్రమ వ్యాపారాల్లో ఉన్నాడని ఆరోపించారు.

గౌరవ్ ఈ-రిక్షా నడుపుతూ, రెండు నెలల క్రితమే ఈ అద్దె ఇంటికి మారాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల మేరకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


Posted

in

by

Tags: