“నేను బతికే ఉన్నాను సాార్..”.. తన హత్య కేసులో తండ్రి, సోదరుడు జైలుకు వెళ్లినట్లు తెలిసి ప్రత్యక్షమైన యువతి!

మధ్యప్రదేశ్: తనను హత్య చేశారనే ఆరోపణలతో తండ్రి, సోదరుడు జైలు పాలయ్యారని తెలిసిన యువతి, క్షేమంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక సస్పెన్స్ సినిమా కథను తలపిస్తోంది.

అసలేం జరిగింది? ఖక్నార్ ప్రాంతానికి చెందిన శివాని అనే యువతి ఏప్రిల్ 24న కనిపించకుండా పోయింది. అదే సమయంలో అర్జున్ అనే యువకుడు కూడా అదృశ్యమయ్యాడు. మే 1న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల తర్వాత మహారాష్ట్రలోని జల్గావ్ జామోద్‌లో ముఖం గుర్తుపట్టలేని విధంగా, తలలేని మరియు పూర్తిగా కాలిన స్థితిలో ఒక యువతి మృతదేహం లభ్యమైంది. అది శివానిదేనని భావించి, ‘ఆనర్ కిల్లింగ్’ కేసులో ఆమె తండ్రి బాపురావ్ మరియు సోదరుడు అజయ్‌లను పోలీసులు అరెస్టు చేసి బుల్ధానా జైలుకు పంపారు.

నిజం బయటపడింది: తన హత్య కేసులో తండ్రి, సోదరుడు జైలులో ఉన్నారని తెలిసిన శివాని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, తాను అర్జున్‌తో కలిసి సొంత నిర్ణయంతో వెళ్లానని, తాము క్షేమంగా ఉన్నామని చెప్పింది. వేలిముద్రలు మరియు అధికారిక పత్రాల ద్వారా శివాని బతికే ఉందని పోలీసులు ధృవీకరించారు. శివాని, అర్జున్లను తదుపరి విచారణ కోసం మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. జైలులో ఉన్న ఆమె తండ్రి, సోదరులను విడుదల చేసే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు.

ఇంకా వీడని మిస్టరీ: శివాని బతికే ఉండటంతో, జల్గావ్‌లో లభ్యమైన ఆ తలలేని మృతదేహం ఎవరిది? అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా దర్యాప్తును కొత్తగా మొదలుపెట్టారు.


Posted

in

by

Tags: