తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం తమిళ రాజకీయాల్లో, చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ తరుణంలో, వారి కుమారుడు జేసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం కుటుంబంలోని విభేదాలను బహిర్గతం చేసింది.
తన మొదటి సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్న జేసన్ సంజయ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి విజయ్ను అనుసరించడం (Unfollow) మానేశారు. విజయ్ రాజకీయ మరియు సినీ జీవితంలో కీలక మార్పులు జరుగుతున్న వేళ, కొడుకు తీసుకున్న ఈ నిర్ణయం ఆయన తన తల్లి సంగీతకు మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేస్తోంది. సంగీత దాఖలు చేసినట్లు చెబుతున్న పిటిషన్లో, 2021 నుండి విజయ్‌కు ఒక ప్రముఖ నటితో ఉన్న సంబంధమే ఈ విభేదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నట్లు సమాచారం.
అనేకసార్లు హెచ్చరించినప్పటికీ విజయ్ ఆ సంబంధాన్ని కొనసాగించారని, దీనివల్ల తనకు మానసిక వేదన కలగడమే కాకుండా, పిల్లలు బహిరంగంగా ఇబ్బంది పడాల్సి వచ్చిందని సంగీత ఆరోపించారు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరినప్పటికీ విజయ్ సహకరించకపోవడంతో, ఆమె కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో అసంతృప్తి చెందిన కొందరు అభిమానులు, సోషల్ మీడియాలో జేసన్ సంజయ్‌ను కఠినంగా విమర్శిస్తున్నారు. “తండ్రికి మద్దతుగా నిలబడకుండా మౌనంగా ఉండటం ఎందుకు?” అని వారు ప్రశ్నిస్తున్నారు. వీరికి బదులిస్తూనే, విజయ్ను ‘అన్‌ఫాలో’ చేసి సంజయ్ తన నిరసనను వ్యక్తం చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
జేసన్ సంజయ్ ఇప్పటికే తన తండ్రి ఇంటి నుండి బయటకు వచ్చి, చెన్నైలో విడిగా నివసిస్తున్నారని సమాచారం. సంజయ్ మొదటి సినిమా ప్రకటన వచ్చినప్పుడు కూడా విజయ్ ఎటువంటి శుభాకాంక్షలు చెప్పకపోవడం గమనార్హం. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టుకు చేరడంతో, కుటుంబం మొత్తం రెండుగా విడిపోవడం అభిమానుల్లో ఆవేదనను కలిగిస్తోంది.
