నేను రేపిస్టును కాదు.. పీడోఫైల్‌ను అంతకంటే కాదు! షూటర్ మేనిఫెస్టోపై విరుచుకుపడ్డ ట్రంప్.. రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం

శనివారం రాత్రి జరిగిన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ వేదికపైకి ప్రవేశించడానికి ప్రయత్నించిన షూటర్ కోల్ అలెన్ రాసిన మేనిఫెస్టోను ప్రస్తావించిన రిపోర్టర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ దాడికి ప్రయత్నించిన వ్యక్తిని “మతోన్మాది”, “క్రైస్తవ వ్యతిరేకి” మరియు “ఒక మానసిక రోగి” అని ట్రంప్ అభివర్ణించారు.

అసలేం జరిగింది? కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ టోమస్ అలెన్ అనే వ్యక్తి, తుపాకులు మరియు కత్తులతో సన్నద్ధమై శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరుగుతున్న హోటల్ వద్ద భద్రతా తనిఖీలను దాటుకుని లోపలికి రావడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ట్రంప్ కూడా అక్కడే ఉన్నారు. నిందితుడు హోటల్ కాంప్లెక్స్ లోపల పలు రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ, భద్రతా సిబ్బంది అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు.

“నేను రేపిస్టును కాదు” ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, ఆదివారం నాడు సిబిఎస్ న్యూస్ (CBS News) ప్రతినిధి నోరా ఓ’డొనెల్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మొదట ప్రశాంతంగానే మాట్లాడిన ట్రంప్, రిపోర్టర్ ఓ’డొనెల్ నిందితుడి మేనిఫెస్టోలోని అంశాలను చదవగానే ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ఆ మేనిఫెస్టోలో – “ఒక పీడోఫైల్ (బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తి), రేపిస్ట్ మరియు దేశద్రోహి చేసిన నేరాలతో నా చేతులు తడుపుకోవడానికి నేను సిద్ధంగా లేను” – అని నిందితుడు రాశాడు.

దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. “మీరు ఇలాంటివి చదువుతారని నాకు తెలుసు, ఎందుకంటే మీరు భయంకరమైన వ్యక్తులు. అవును, వాడు అలా రాశాడు. కానీ నేను రేపిస్టును కాదు, నేను ఎవరిపై అత్యాచారం చేయలేదు. నేను పీడోఫైల్‌ను కూడా కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేఫ్రీ ఎప్‌స్టీన్ వంటి వివాదాస్పద వ్యక్తులతో తనకున్న సంబంధాల గురించి పరోక్షంగా ఈ మేనిఫెస్టోలో ప్రస్తావించినట్లు భావించిన ట్రంప్.. “ఒక పిచ్చివాడు రాసిన చెత్తను చదువుతారా? నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికించారు, కానీ ఆ కేసులన్నింటి నుండి నేను క్లీన్ చిట్‌తో బయటపడ్డాను. అవతలి పక్షం (డెమొక్రాట్లు) వారికే ఎప్‌స్టీన్ వంటి వారితో సంబంధాలు ఉన్నాయి. మీరు ఇలాంటివి చదివినందుకు సిగ్గుపడాలి” అని ఫైర్ అయ్యారు.

షూటర్ గురించి ట్రంప్ వ్యాఖ్యలు: “నేను ఆ మేనిఫెస్టో చదివాను. అతడు మతోన్మాదిలా మారాడు. మొదట క్రైస్తవుడే కానీ తర్వాత క్రైస్తవ వ్యతిరేకిగా మారాడు. అతడు ఖచ్చితంగా మానసిక రోగి అయి ఉంటాడు” అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే అమెరికాలో జరుగుతున్న ఇలాంటి రాజకీయ హింసకు డెమొక్రాట్ నేతల “ద్వేషపూరిత ప్రసంగాలే” కారణమని ఆయన ఆరోపించారు.

‘నేనేమీ భయపడలేదు’ కాల్పుల శబ్దం విన్నప్పుడు తాను ఏమాత్రం భయపడలేదని ట్రంప్ చెప్పారు. “నాకు జీవితం అంటే ఏంటో తెలుసు. మనం ఒక వెర్రి ప్రపంచంలో జీవిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లలో ట్రంప్‌పై జరిగిన మూడవ హత్యాయత్నం ఇది. కాల్పులు జరిగిన వెంటనే వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్‌ను సెకన్లలో ఖాళీ చేయించగా, ట్రంప్‌ను బయటకు తీసుకురావడానికి ఎందుకు ఆలస్యమైందని అడగగా.. “అక్కడ ఏం జరుగుతుందో చూడాలని నేను అనుకున్నాను, అందుకే నేను సెక్యూరిటీకి అంత సులభంగా దొరకలేదు. ఆగు.. ఆగు.. ఏం జరుగుతుందో చూడనివ్వు అని వారితో అన్నాను” అని సమాధానమిచ్చారు.


Posted

in

by

Tags: