80వ దశకంలో తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయికలుగా వెలుగొందిన అక్కాచెల్లెళ్లు అంబిక, రాధ. వీరికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ చెన్నైలో వేల కోట్ల విలువైన 25 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారంటూ ఇటీవల నెట్టింట వైరల్ అయిన వార్త తీవ్ర దుమారం రేపింది.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్లో జర్నలిస్ట్ చేగువేరా మాట్లాడుతూ, “80ల త్రిష అంబికే.. అందుకే ఆమెకు ఎంజీఆర్ 25 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు” అని పేర్కొన్నారు. ఈ నిరాధారమైన పుకార్లపై నటి అంబిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఓ తాజా ఇంటర్వ్యూలో అతనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. “నేను 80ల త్రిషను అయితే, అప్పుడు విజయ్ ఎవరో కూడా ఆయనే చెప్పాలి. ఎంజీఆర్ నాకు 25 ఎకరాల భూమి రాసిచ్చినప్పుడు బహుశా ఇతనే అక్కడ తహసీల్దార్గా పనిచేసి ఉంటాడు కాబోలు! ఆ భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇతని దగ్గరే పెట్టుకుని, ఇప్పుడు మీడియాలో సైగలు చేస్తున్నట్లున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు.
అంతటితో ఆగకుండా, “చేగువేరా మహిళల గురించి తప్పుగా మాట్లాడటం మానుకోవాలి. దళపతి విజయ్ తల్లి శోభా అక్క గురించి కూడా గతంలో ఆయన మాట్లాడిన అసభ్యకరమైన వీడియోను నేను చూశాను; ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆమె డిమాండ్ చేశారు.
“తాము జర్నలిస్టులమని, ఏం మాట్లాడినా చెల్లుతుందని విర్రవీగుతూ.. రాజకీయ నాయకుల కంటే ఘోరంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ముందు వాళ్ల కుటుంబ సభ్యులే వాళ్లకు బుద్ధి చెప్పాలి” అంటూ అంబిక తన తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
