“నేనేమీ పెద్ద హీరోని కాదు, ఒక తండ్రిని!”. 9 నిమిషాల పాటు చావుతో పోరాడిన 3 ఏళ్ల పసికందు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!!

లండన్: లండన్‌లోని ఇల్ఫోర్డ్ (Ilford) ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తు కిటికీ గ్రిల్స్ నుండి కిందపడబోయిన ఒక మూడేళ్ల పసికందును.. ఒక భారతీయ యువకుడు తన క్రికెట్ ఫీల్డింగ్ నైపుణ్యంతో గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ పట్టి కాపాడాడు. గుండెల్ని పిండేసే ఈ ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో నెటిజన్ల కన్నీళ్లు పెట్టిస్తోంది. సదరు యువకుడిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇల్ఫోర్డ్ హై రోడ్ ప్రాంతంలోని ఒక దుకాణం పైనున్న ఫ్లాట్ కిటికీ వెలుపల ఈ చిన్నారి అత్యంత ప్రమాదకరమైన రీతిలో వేలాడుతుండటాన్ని చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. దాదాపు 9 నిమిషాల పాటు ఆ చిన్నారి కిటికీ అంచును పట్టుకుని ప్రాణాల కోసం కొట్టుమిట్టాడింది.

అదే సమయంలో పైనుంచి ఒక మహిళ కిటికీ గుండా ఆ పాపను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కింద రక్షణ గోడపై నిలబడిన ఒక పోలీసు అధికారి చేయి కూడా ఆ పాపకు అందకపోవడంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ, భయాందోళనలు నెలకొన్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆ చిన్నారి చేతుల పట్టు సడలి, ఒక్కసారిగా కింద పడిపోయింది.

సరిగ్గా అదే సెకన్ లో అక్కడ ఉన్న మహ్మద్ జెసిల్ (Mohammad Jesil) అనే భారతీయ యువకుడు ఎలాంటి భయం లేకుండా మెరుపు వేగంతో ముందుకు దూసుకొచ్చాడు. గాల్లో నుండి పడిపోతున్న ఆ పసి ప్రాణాన్ని ఒక క్రికెట్ ఫీల్డర్ లాగా అత్యంత లాఘవంగా తన చేతుల్లోకి క్యాచ్ పట్టి సురక్షితంగా కాపాడాడు.

ఐదు నెలల వయసున్న కవల పిల్లలకు తండ్రి అయిన మహ్మద్ జెసిల్ ఈ ఘటనపై చాలా ఎమోషనల్‌గా స్పందించారు. “నేను ఇండియాలో క్రికెట్ ఆడిన అనుభవం, అలాగే ఒక తండ్రిగా నాలోని భావోద్వేగమే ఈ క్లిష్ట పరిస్థితిలో ఆ చిన్నారిని కాపాడటానికి నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి” అని ఆయన పేర్కొన్నారు.

“వారే మా కుటుంబం పాలిట దేవదూతలు” అని ఆ చిన్నారి తల్లిదండ్రులు మహ్మద్ జెసిల్‌కు, సదరు పోలీసు అధికారికి కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అద్భుతమైన రెస్క్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో అల్ట్రా స్పీడ్‌తో వైరల్ అవుతూ ట్రెండ్ అవుతోంది.


Posted

in

by

Tags: