“నొప్పితో, స్పృహ తప్పే స్థితిలో తల్లడిల్లుతున్న వేళ ఆదుకున్న ఆ చేతులను జీవితాంతం మర్చిపోగలమా?”.. భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపిన మహిళ!

కోల్‌కతాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక మహిళకు, దాదాపు 25 మంది చోద్యం చూస్తుండగా, గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు ముందుకొచ్చి సహాయం చేసిన ఘటన సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది.

పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో బైక్ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న బిందియా గుప్తా అనే మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి, లేచి నిలబడలేని స్థితిలో కిందపడిపోయారు.

ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ చాలామంది గుమిగూడినప్పటికీ, కొందరు మాత్రమే ముందుకొచ్చి ఆమెను పైకి లేపి, ఆమె వస్తువులు, చెప్పులు, మొబైల్ ఫోన్‌ను సురక్షితంగా భద్రపరిచారు. అంతేకాకుండా, గాయపడిన ఆమె కాలికి కట్టు కట్టి సహాయం చేశారు.

తనకు ఎదురైన ఈ అనుభవానికి సంబంధించిన వీడియోను బిందియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అందులో గాయపడిన ఆమె కాలికి ఒక మహిళ జాగ్రత్తగా కట్టు కట్టడం, మిగిలిన వారు పక్కనే ఉండి ధైర్యం చెప్పడం రికార్డయింది.

స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న తనను ఆ ఐదుగురు ఎంతో శ్రద్ధగా చూసుకున్నారని, వారి పేర్లు కూడా తనకు తెలియకపోయినా, కష్ట సమయంలో వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేనని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.

మనం ఇతరులకు చేసే మంచి ఏదో ఒక రోజు తిరిగి మనకే వస్తుందని తాను నమ్ముతున్నానని తెలిపిన ఆమె, రోడ్డుపై ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు చూస్తూ ఉండిపోకుండా సహాయం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలువురు ఆ మంచి మనసున్న వ్యక్తులను ప్రశంసిస్తున్నారు. కష్ట సమయాల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని కామెంట్లు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *