ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాథ్రస్ ప్రాంతంలో, డయాగ్నోస్టిక్ సెంటర్ (పరీక్షల కేంద్రం) పేరుతో నడుపుతున్న ఒక చోట 15 ఏళ్ల బాలికకు జరిగిన ఘోరం సమాజాన్నంతటినీ ఉలిక్కిపడేలా చేసింది.
సదరు బాలిక తన బంధువుతో కలిసి చికిత్స కోసం ఆ కేంద్రానికి వెళ్లినప్పుడు, ఆమె బంధువు మార్కెట్‌కు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, ల్యాబ్ యజమాని ఆ బాలికకు మత్తుమందు ఇచ్చి, స్పృహ లేని స్థితిలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మత్తు దిగిన తర్వాత బాలిక గట్టిగా ఏడవడంతో, ఆ మృగాడు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో, వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇంద్రపాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా నడుపుతున్న ఆ ల్యాబ్‌ను ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే సీజ్ చేసి సీల్ వేశారు. బాధితురాలైన బాలికకు ప్రస్తుతం రక్షణ కల్పించగా.. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, సిసిటివి ఫుటేజ్ మరియు ఇతర ఆధారాలతో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
