భారత్ మరియు పాకిస్థాన్ అండర్-19 జట్ల మధ్య జరుగుతున్న ఉత్కంఠభరితమైన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లో, భారత ఆటగాడు యష్‌వర్ధన్ చౌహాన్ అవుటైన విధానం పెద్ద ‘నో-బాల్’ వివాదానికి దారితీసింది.
మ్యాచ్ 11.4వ ఓవర్లో పాకిస్థాన్ బౌలర్ రిజ్వానుల్లా వేసిన బంతికి యష్‌వర్ధన్ చౌహాన్ బౌల్డ్ అయ్యాడు. అయితే, బౌలర్ క్రీజు దాటి (ఓవర్ స్టెప్) బంతి విసిరాడా లేదా అని సరిచూసేందుకు ఆన్-ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు.
థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లే చేసి చూసినప్పటికీ, కెమెరా విజువల్స్ చాలా అస్పష్టంగా, బ్లర్‌గా ఉండటంతో ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయారు. అంపైర్ జూమ్ చేసి చూసినప్పటికీ, బౌలర్ మడమ (హీల్) గీత లోపల ముందుగా నేలను తాకిందా లేదా అనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించలేకపోయారు.
నిబంధనల ప్రకారం, బౌలర్ కాలు నేలను తాకిన తొలి క్షణాన్ని బట్టి నో-బాల్‌ను నిర్ధారించాలి. అయితే, స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో థర్డ్ అంపైర్ ‘బెనిఫిట్ ఆఫ్ ది డౌట్’ (సందేహ ప్రయోజనాన్ని) బౌలర్‌కే ఇచ్చి, ‘అవుట్’ అనే నిర్ణయాన్ని సమర్థించారు. దీంతో షాక్‌కు గురైన భారత అభిమానులు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత అండర్-19 జట్టు, పాకిస్థాన్ బౌలర్ల నిప్పులు చెరిగే బంతుల ముందు నిలబడలేక తీవ్రంగా తడబడుతోంది. కేవలం 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

Leave a Reply