వడోదర వేదికగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో, కివీస్ జట్టు తరఫున ఆదిత్య అశోక్ అనే తమిళ యువకుడు బరిలోకి దిగాడు. ఇతని పూర్వీకులు తమిళనాడులోని వెల్లూరు జిల్లాకు చెందిన వారు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇతనిపై పడింది.
ఎవరీ ఆదిత్య అశోక్?
- నేపథ్యం: ఆదిత్యకు 4 ఏళ్ల వయసున్నప్పుడే అతని కుటుంబం వెల్లూరు నుండి న్యూజిలాండ్‌కు వలస వెళ్ళింది.
- క్రికెట్ ప్రయాణం: ఆదిత్య అద్భుతమైన లెగ్ స్పిన్నర్. గూగ్లీలు వేయడంలో ఇతను దిట్ట. ఇప్పటికే న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ ఇష్ సోదీకి వారసుడిగా ఇతడిని భావిస్తున్నారు.
- శిక్షణ: గత ఏడాది న్యూజిలాండ్ ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు గెలుచుకున్న తర్వాత, ఆదిత్య చెన్నైకి వచ్చి CSK అకాడమీలో స్పిన్ మెళకువలు నేర్చుకున్నాడు. రచిన్ రవీంద్ర బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆదిత్య తన బౌలింగ్‌ను పదును పెట్టుకున్నాడు.
తీవ్రమైన రజినీకాంత్ అభిమాని:
ఆదిత్య అశోక్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి వీరాభిమాని. తన అభిమానాన్ని ఎంతలా చాటుకున్నాడంటే.. ‘పడయప్ప’ (నరసింహా) సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్ “ఎన్ వళి తని వళి” (నా దారి రహదారి) అనే వాక్యాన్ని తన చేతిపై పచ్చబొట్టు (Tattoo) వేయించుకున్నాడు. ఇది చూసిన తమిళ మరియు భారతీయ క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు.
న్యూజిలాండ్‌లో భారత సంతతి ఆటగాళ్ళు:
న్యూజిలాండ్ జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలో ఇష్ సోదీ, ముంబైకి చెందిన అజాజ్ పటేల్, బెంగళూరుకు చెందిన రచిన్ రవీంద్ర వంటి వారు రాణించారు. ఇప్పుడు ఆ జాబితాలో వెల్లూరుకు చెందిన ఆదిత్య అశోక్ వచ్చి చేరాడు.
