ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో, దీపావళి పండుగ రోజున ఓ పాత ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ప్రమాదంలో 60 ఏళ్ల వృద్ధురాలు, 28 ఏళ్ల యువతి, పుట్టి కేవలం 20 రోజులే అయిన పసికందు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 32 ఏళ్ల యువకుడు గాయపడ్డాడు. ఇంట్లో దీపావళి వేడుకల కోసం సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ ఘోరం జరగడం ఆ కుటుంబాన్ని, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాన్పూర్ జిల్లా పంకి (Panki) ప్రాంతంలోని పంకి పడావ్ వద్ద అవధేష్ శుక్లా అనే వ్యక్తికి చెందిన సుమారు 35 ఏళ్ల నాటి పాత ఇల్లు ఉంది. ఒక అంతస్తు ఉన్న ఆ ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయి. ఆ ఇంటి పైకప్పును వెదురు, కలప, మట్టితో నిర్మించినట్లు సమాచారం.
ఘటన జరిగిన రోజు ఉదయం సుమారు 8.30 నుంచి 9 గంటల మధ్య, హర్ష్ శుక్లా తన తల్లి వినోదిని శుక్లాతో కలిసి ఒక గదిలో కూర్చుని మాట్లాడుతున్నాడు. అదే గదిలో హర్ష్ భార్య అంశిక శుక్లా, పుట్టి 20 రోజులే అయిన తన మగబిడ్డ ఆరవ్‌కు పాలిస్తోంది. అప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఆ గది పాత పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలి వారిపై పడింది. దీంతో ఆ నలుగురూ శిథిలాల కింద చిక్కుకున్నారు.
పైకప్పు కూలిన శబ్దం విన్న ఇంటి మరో భాగంలో ఉన్న అవధేష్ శుక్లా, అతని మరో కుమారుడు రాజు వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి వారు ఇరుగుపొరుగు వారి సహాయంతో తీవ్రంగా శ్రమించారు.
హర్ష్ ఎలాగోలా శిథిలాల నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత అందరూ కలిసి శిథిలాలను తొలగించి మిగతావారిని బయటకు తీశారు. వెంటనే నలుగురినీ కళ్యాణ్పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. 60 ఏళ్ల వినోదిని శుక్లా, 28 ఏళ్ల అంశిక శుక్లా, 20 రోజుల చిన్నారి ఆరవ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన హర్ష్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
వివాహమై రెండేళ్లు అయిన హర్ష్, పంకి ప్రాంతంలోని స్టీల్ అథారిటీ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి, అంశికకు 20 రోజుల క్రితమే మగబిడ్డ జన్మించాడు. బిడ్డ రాకతో ఎంతో సంతోషంలో ఉన్న ఆ కుటుంబం, దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమైంది.
కానీ, ఒక్క క్షణంలో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబ సంతోషాన్ని తీవ్ర విషాదంగా మార్చేసింది. పాతబడిన ఇంటి పైకప్పులో నీరు కారి బరువు పెరిగి ఉండొచ్చని, అందుకే పైకప్పు కూలిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply