మహారాష్ట్రలోని పుణే సమీపంలో గల కోలవిహిరే గ్రామం కడేమాలా ప్రాంతంలో, పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి సుమారు ₹14 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇంటి యజమానులు రోజువారీ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, గుర్తుతెలియని దుండగులు ఈ సాహసోపేతమైన పగటి చోరీకి పాల్పడ్డారు. జనసంచారం ఉన్న పగటి వేళలోనే ఇంటి తాళాలను సునాయాసంగా పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు.. బీరువా, లాకర్లను పగులగొట్టి అందులోని ₹14 లక్షల విలువైన విలువైన బంగారు, వెండి నగలను ఊడ్చుకుని పరారయ్యారు.
పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు.. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం, బంగారు ఆభరణాలు చోరీకి గురికావడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురై కన్నీరుమున్నీరయ్యారు. పట్టపగలే జరిగిన ఈ భారీ చోరీ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు.. దొంగల వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామం నడిబొడ్డున పట్టపగలే జరిగిన ఈ తెగింపు చోరీ స్థానికుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply