జయపూర్: జయపూర్లో ఎక్సైన్ (XEN) భార్య అను మీనా ఆత్మహత్య కేసులో ఎఫ్ఐఆర్ ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్త గౌతమ్ మీనాకు ఇంట్లో పనిమనిషితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయం బయటపడినప్పుడు అతను తన సోదరిని తీవ్రంగా వేధించాడని మృతురాలి సోదరుడు నీరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది? గత ఏడాది దీపావళి సమయంలో చిత్వాడీ గ్రామంలోని తమ పూర్వీకుల ఇంటి వద్ద గౌతమ్ మీనా, పనిమనిషితో అక్రమ సంబంధం కలిగి ఉండగా అను మీనా స్వయంగా చూసింది. ఆ సమయంలో పిల్లలను నానమ్మ దగ్గర వదిలేసి, వారు అక్కడికి వెళ్లారు. గౌతమ్ చేసిన తప్పును అడ్డుకున్నప్పుడు, అతను అనుపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని అను తన తల్లికి ఫోన్ చేసి కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకోగా, గౌతమ్ క్షమాపణలు కోరి, ఇకపై అలాంటి తప్పు చేయనని హామీ ఇచ్చాడు.
చంపేందుకు యత్నించిన భర్త: “మా అక్క గౌతమ్ మారతాడని ఎప్పుడూ ఆశించేది. కానీ, మార్చి 13న తనను, తన ఇద్దరు పిల్లలను ఇంట్లో బంధించి, ఎల్పీజీ గ్యాస్ ఆన్ చేసి బయటకు వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా గ్యాస్ లీక్ అవుతున్న ఇంట్లోనే వారు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పొరుగువారి సాయంతో వారు బయటపడ్డారు. అయినప్పటికీ, భర్త ఒంటరివాడని, అతడిని చూసుకోవడానికి ఎవరూ లేరని చెప్పి నా అక్క తిరిగి అతడి వద్దకే వెళ్ళింది” అని నీరజ్ పేర్కొన్నారు.
అమానవీయ ప్రవర్తన: గౌతమ్ మీనా భార్యపై అమానుషంగా ప్రవర్తించేవాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మద్యం మత్తులో భార్య ముఖంపై ఉమ్మి వేయడం, షూలతో కొట్టడం వంటి పనులు చేసేవాడని, ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని సోదరుడు తెలిపారు. గౌతమ్ మీనా తాతలు, మామలు కూడా అతడి చర్యలను సమర్థిస్తూ, అతడికి మరో వివాహం చేస్తామని భార్యను అవమానించేవారని, ఆమెను ఇంటి నుంచి బయటకు పంపాలని ప్రయత్నించేవారని ఫిర్యాదులో ఉంది.
ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడు: గౌతమ్ మీనా మద్యం అలవాటు, కట్నం కోసం వేధింపులు, మరియు నిరంతర హింస భరించలేక అను మీనా ఏప్రిల్ 7న ఆత్మహత్య చేసుకుంది. అయితే, నిందితుడు గౌతమ్ మాత్రం ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా, “నేను జైలుకు వెళ్లినా బెయిల్పై తిరిగి వస్తాను” అని మృతురాలి తండ్రితోనే ధీమాగా చెప్పడం విశేషం. దీనిని బట్టి నిందితుడి క్రూరత్వం ఎంతటిదో అర్థమవుతోంది.
ప్రస్తుతం బాధితురాలి కుటుంబ సభ్యులు గౌతమ్ మీనాను కఠినంగా శిక్షించాలని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
