పనిమనిషిని బెడ్‌లో దాచిపెట్టి.. ఆపై దారుణ హింస! గువహటిలో వెలుగు చూసిన షాకింగ్ వీడియో

గువహటిలోని పంజాబారి ప్రాంతంలో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసే ఒక సంఘటన జరిగింది. 13 ఏళ్ల మైనర్ బాలికను బెడ్ (మంచం) బాక్స్‌లో దాచిపెట్టిన దిగ్భ్రాంతికర విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగుతోంది.

పంజాబారిలోని జూరిపార్ ప్రాంతంలో ఉన్న హౌస్ నంబర్ 69లో ఈ దారుణం జరిగింది. అమ్రీన్ అక్తర్ లస్కర్ అనే మహిళ ఇంట్లో డిస్ట్రిక్ట్ లేబర్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెజిస్ట్రేట్ సమక్షంలో ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు.

ఆ ఇంట్లో అసలేం జరిగింది?

అధికారుల సమాచారం ప్రకారం.. ఈ మైనర్ బాలిక గత ఆరేళ్లుగా ఆ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. ఆ సమయంలో ఆమెపై నిరంతరం శారీరక దాడులు జరుగుతున్నాయి. అధికారుల బృందం దాడులకు వస్తున్నట్లు సమాచారం అందగానే, నిందితురాలు ఆ బాలికను సుమారు 25 నిమిషాల పాటు బెడ్ బాక్స్ లోపల పెట్టి మూసివేసింది.

చివరికి నిజం బయటపడిందిలా..

టాస్క్ ఫోర్స్ అధికారులు ఇంటికి చేరుకున్నప్పుడు, ఇంటి యజమానురాలు అరినా లస్కర్ ఖాతున్ ఆ బాలిక ఇంట్లో లేదని అబద్ధం చెప్పింది. మూడు నాలుగు రోజుల క్రితమే ఆ అమ్మాయి తండ్రి వచ్చి తనను తీసుకెళ్లిపోయాడని నమ్మబలికింది. అయితే ఇంట్లోని పరిస్థితి అనుమానాస్పదంగా అనిపించడంతో అధికారులు సోదాలు నిర్వహించారు.

బెడ్ బాక్స్ తెరిచి చూడగా బాలిక అందులో కుక్కి ఉండటం చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆమెను బయటకు తీసి నీళ్లు తాగించగా, స్పృహలోకి వచ్చిన ఆ చిన్నారి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. గత చాలా కాలంగా తనపై దాడులు జరుగుతున్నాయని, హింసిస్తున్నారని ఆ బాలిక విచారణలో వెల్లడించింది. ప్రస్తుతం బాలికను సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.


Posted

in

by

Tags: