“పరుగెడుతూనే ఉన్నాడేంటి.. ఎవరైనా పట్టుకోండయ్యా!”.. సెక్యూరిటీ సిబ్బందికి చుక్కలు చూపించిన బాలుడు.. ఫుట్‌బాల్ మైదానంలో రౌండ్లు కొడుతూ పరుగులు.. వైరల్‌గా మారిన వీడియో!

సింగపూర్ నేషనల్ స్టేడియంలో బ్రెజిల్, సింగపూర్ జట్ల మధ్య జరిగిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చి, భద్రతా సిబ్బందికి దొరక్కుండా పరుగులు పెట్టాడు. చివరకు అతడిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది పడిన తిప్పలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ చివరి నిమిషాల్లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు ఎండ్రిక్‌తో సెల్ఫీ దిగాలనే ఉద్దేశంతో ఓ యువ అభిమాని చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని మైదానం మధ్యలోకి పరుగెత్తాడు.

ఆ బాలుడు బ్రెజిల్ జట్టు ధరించే పసుపు రంగు జెర్సీని ధరించి ఉండటంతో, మొదట భద్రతా సిబ్బంది కూడా అతడిని బ్రెజిల్ ఆటగాడిగానే పొరబడి ఉండవచ్చని చెబుతున్నారు. దీంతో వారు అప్రమత్తమయ్యేలోపే అతడు నేరుగా ఎండ్రిక్ దగ్గరకు చేరుకుని చక్కగా సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాతే అతడు ఆటగాడు కాదని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకునేందుకు పరుగులు తీశారు.

అయితే మొదట తనను పట్టుకునేందుకు వచ్చిన సెక్యూరిటీ సిబ్బందికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకున్న బాలుడు.. తిరిగి ప్రేక్షకుల గ్యాలరీ వైపు పరుగెత్తాడు. మార్గమధ్యంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో సిబ్బందిని కూడా తప్పించుకోవడంతో, అతను అదుపుతప్పి కిందపడిపోయాడు.

తనను వెంబడిస్తూ వచ్చిన పలువురు భద్రతా సిబ్బందికి దొరక్కుండా వేగంగా పరుగులు తీస్తూ వారిని బోల్తా కొట్టించిన బాలుడు.. చివరకు ప్రేక్షకుల గ్యాలరీ వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న మరో భద్రతా సిబ్బంది అతడిని పట్టుకోవడంతో ఈ పరుగుల పర్వానికి తెరపడింది.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన బ్రెజిల్ జట్టు 7-0 గోల్స్ తేడాతో సింగపూర్‌పై ఘన విజయం సాధించింది. బ్రెజిల్ తరఫున వినీషియస్ జూనియర్ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. ఎండ్రిక్, ఎస్టేవావో విలియన్, రయాన్ ఒక్కో గోల్ సాధించారు. సింగపూర్ ఆటగాడు రౌల్ సుహైమీ చేసిన సెల్ఫ్ గోల్ కూడా బ్రెజిల్‌కు కలిసొచ్చింది.

అయితే మ్యాచ్ ఫలితం కంటే ఈ బాలుడి పరుగులే ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమయ్యాయి. “90 నిమిషాల ఆటలో ఆటగాళ్లు దాటిన దానికంటే.. ఈ బాలుడు ఎక్కువ మంది సెక్యూరిటీ సిబ్బందిని దాటేశాడు” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *