“పసికందు అని కూడా చూడకుండా ఘోరం!” – ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువు చేతులు, కాళ్లు విరిచేసిన క్రూరమైన నర్సుకు 5 ఏళ్ల జైలు. సీసీటీవీలో బయటపడ్డ షాకింగ్ ఘటన..!!!

టర్కీలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఇంక్యుబేటర్‌లో ఉన్న పసికందుకు రక్తం తీసేందుకు యత్నించిన క్రమంలో, ఆ శిశువుపై కిరాతకంగా దాడి చేసి ఎముకలు విరిచేసిన ఓ నర్సుకు న్యాయస్థానం 5 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

టర్కీలోని ఓ యూనివర్సిటీ హెల్త్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలో 2021 మే 26న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లా – సెమా బోజోక్లర్ దంపతులకు తక్కువ బరువుతో పుట్టిన డెనిజ్ ఎసిన్ బోజోక్లర్ అనే పసికందును ఐసీయూలోని ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆ సమయంలో విధుల్లో ఉన్న హజల్ టిరిక్ బగ్రియానిక్ (33) అనే నర్సు, చిన్నారికి రక్తం తీసేందుకు యత్నించగా శిశువు కదులుతూ ఏడ్చింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ నర్సు, సుమారు 14 నిమిషాల పాటు సాగిన ఆ రక్త పరీక్ష సమయంలో పసికందు తలపై పదేపదే కొట్టడంతో పాటు, కాళ్లను గట్టిగా నొక్కిపెట్టి, మెలితిప్పి ఎముకలు విరిగేలా చేసింది. చిన్నారిపై జరిగిన ఈ కిరాతక దాడి అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

పసికందుపై నర్సు చేసిన ఈ దాడి ఘటన జరిగిన 5 రోజుల తర్వాత, అంటే మే 31న మరో నర్సు దృష్టికి వచ్చింది. వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం అందించడంతో, నిందితురాలైన నర్సు హజల్ టిరిక్ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు.

అనంతరం ఈ ఘటనపై క్రిమినల్ కోర్టులో కేసు విచారణ సాగింది. ఈ కేసు తుది విచారణ సందర్భంగా, అరెస్టయిన నర్సు తనపై మోపబడిన అభియోగాలను అంగీకరించి, చిన్నారి కుటుంబ సభ్యులకు, టర్కీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ఆ పని తాను ఎలా చేశానో తనకే తెలియదని కోర్టులో వాదించింది.

అయితే ఇరు పక్షాల వాదనలు, ఫోరెన్సిక్ మెడికల్ రిపోర్టులు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన న్యాయమూర్తి.. సదరు నర్సు తన విధులను దుర్వినియోగం చేసిందని, తనను తాను రక్షించుకోలేని పసికందుపై ఉద్దేశపూర్వకంగానే ఈ ఘాతుకానికి పాల్పడిందని స్పష్టం చేశారు.

నిందితురాలిలో నిజమైన పశ్చాత్తాపం ఏమీ కనిపించలేదని పేర్కొన్న న్యాయమూర్తి, శిక్షను తగ్గించడానికి నిరాకరించారు. దీని ప్రకారం, నర్సు హజల్ టిరిక్ బగ్రియానిక్‌కు 5 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు, ఆమె కస్టడీ (డిటెన్షన్) కొనసాగుతుందని ఆదేశిస్తూ సంచలన తీర్పు వెలువరించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *