పసిపిల్లకి ప్రాణభయం చూపించారు కదరా..! “నా బిడ్డ లోపల ఉంది”.. కారు అద్దాలు పగలగొట్టిన ఆందోళనకారులు.. గుండెలవిసేలా ఏడ్చిన మహిళ.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో..!!

ప్రశాంతమైన వాతావరణం కోసం పర్యాటక ప్రాంతాలకు వెళ్లే కుటుంబాల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తేలా ఒక భయానక ఘటన చోటుచేసుకుంది.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో బుధవారం నాడు కేఎస్‌యూ (KSU) సంస్థ నిర్వహించిన నల్లజెండాల మోటార్ సైకిల్ ర్యాలీ తీవ్ర హింసాత్మకంగా మారింది. ఆ ర్యాలీ మధ్యలో చిక్కుకున్న ఒక పర్యాటక కుటుంబం ప్రయాణిస్తున్న వాహనంపై ఆందోళనకారులు విచక్షణారహితంగా దాడి చేశారు.

ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో భయాందోళనకు గురైన ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారు అద్దాలను రాళ్లు, కర్రలతో కొట్టి ధ్వంసం చేశారు. అయినా పరిస్థితిని గమనించిన డ్రైవర్ ఏమాత్రం వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆలోపే కారు అద్దాలన్నీ తునాతునకలయ్యాయి. కారు లోపల ఉన్న పసికందుతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర భయంతో వణికిపోయారు. ఈ ఘటనపై వాహనంలో ఉన్న ప్రయాణికురాలు ఒక వీడియోను విడుదల చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

“షిల్లాంగ్‌లో అకస్మాత్తుగా కొందరు ఎలాంటి కారణం లేకుండా మా కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. కారులో నా చిన్నారి ఉంది. నా బిడ్డ ముఖం చూడండి, కారు అద్దాలను ఎలా ధ్వంసం చేశారో చూడండి” అంటూ ఆమె ఆ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. పోలో, బారిక్, మావ్లాయ్ వంటి పలు ప్రాంతాల్లో ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏకంగా పోలీసు ఎస్కార్ట్ వాహనంపైనే దుండగులు దాడి చేయడంతో పాటు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) వాహనం వెనుక అద్దాన్ని పగలగొట్టారు. అలాగే ఒక పికప్ ట్రక్, టెలికాం విభాగానికి చెందిన వాహనాలను కూడా ధ్వంసం చేశారు.

ముఖ్యంగా ఒక ప్రభుత్వ వాహనానికి నిప్పు పెట్టారు. ఆందోళనకారులు ఇనుప రాడ్లతో వాహనాల అద్దాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా, ఆర్.ఆర్. కాలనీ ప్రాంతంలో ఉన్న స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాల చుట్టూ ఉన్న రక్షణ గ్లాస్ బాక్సులను కూడా నిరసనకారులు పగులగొట్టారు.

ఉద్యోగాల కేటాయింపు, గిరిజనుల రక్షణ, అక్రమ వలసలు మరియు పర్యావరణ సమస్యలతో కూడిన ఐదు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేఎస్‌యూ ఈ బైక్ ర్యాలీని నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆ సంస్థ హెచ్చరించిన క్రమంలో.. తాజాగా జరిగిన ఈ దాడులు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతను, కలకలాన్ని రేపాయి.


Posted

in

by

Tags: