నిషేధిత వేర్పాటువాద సంస్థ అయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా పాకిస్థాన్ ఆర్మీ మాజీ కెప్టెన్ రెహ్మాన్ గుల్ నియమితులయ్యారు.
మాజీ నాయకుడు బషీర్ జెబ్ (Bashir Zeb) పదవి నుంచి తప్పుకోవడంతో, ఆ సంస్థ ఉన్నత స్థాయి కమాండ్ కౌన్సిల్ ఏకగ్రీవ ఓటింగ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి జీయాంద్ బలూచ్ నవంబర్ 14వ తేదీన ప్రకటించారు.
గతంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 19వ ఫ్రాంటియర్ ఫోర్స్‌లో కెప్టెన్‌గా పనిచేసిన రెహ్మాన్ గుల్, పౌరులపై సైన్యం చేస్తున్న అకృత్యాలకు నిరసనగా 2010లో ఆ దళం నుంచి బయటకు వచ్చి అస్లాం బలూచ్ నేతృత్వంలోని బలూచ్ లిబరేషన్ ఆర్మీలో చేరారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని కోట్లి, అలాగే ఉత్తర మరియు దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఆత్మాహుతి దళం (సూసైడ్ స్క్వాడ్) ‘మజీద్ బ్రిగేడ్’ అధిపతిగా కూడా పనిచేశారు.
రెహ్మాన్ గుల్ తమ్ముడు ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ కమ్యూనికేషన్స్ విభాగంలో మేజర్‌గా పనిచేస్తుండటం ఈ నియామకానికి మరింత ప్రాధాన్యతను సంతరించిపెట్టింది. బలూచిస్థాన్ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చేపడుతున్న చర్యలు మరియు పౌరుల మరణాల పట్ల ఆ దేశ భద్రతా దళాల్లోనే ఉన్న అసంతృప్తిని ఈ మార్పు బహిర్గతం చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మాజీ నాయకుడు బషీర్ జెబ్ తన పదవికి రాజీనామా చేసి, అధికారాన్ని కమాండ్ కౌన్సిల్‌కు అప్పగించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. కాగా, బషీర్ జెబ్ ఆఫ్ఘనిస్థాన్‌లో విష ప్రయోగంతో హత్య చేయబడ్డాడంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్లను సంబంధిత వర్గాలు ఖండించాయి. అలాగే గత ఏడాది రెహ్మాన్ గుల్ చంపబడ్డాడని పాకిస్థాన్ సైన్యం చేసిన ప్రకటనను కూడా ఈ కొత్త నియామకం అబద్ధమని తేల్చింది.

Leave a Reply