ఢాకాలో జరిగిన శాఫ్ (SAFF) ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో భారత్ 2-1 గోల్స్ తేడాతో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి, తన 10వ ఛాంపియన్షిప్ టైటిల్‌ను, వరుసగా 3వ సారి ట్రోఫీని గెలుచుకుని చారిత్రాత్మక రికార్డు సృష్టించింది.
మ్యాచ్ మొదటి అర్ధభాగం అదనపు సమయంలో పాకిస్థాన్ ఆటగాడు అలంగీర్ ఘాజీ తొలి గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే, ఆట 59వ నిమిషంలో ప్రమాదకర రీతిలో ఢీకొట్టినందుకు పాకిస్థాన్ ఆటగాడు జునైద్ షాకు వీఏఆర్ (VAR) సమీక్ష అనంతరం రెడ్ కార్డ్ చూపి మైదానం నుంచి పంపించేశారు. దీనిని సద్వినియోగం చేసుకున్న భారత్, ఆ మరుసటి నిమిషమే (60వ నిమిషం) సుహైల్ అహ్మద్ భట్ చేసిన గోల్‌తో స్కోరును సమం చేసింది.
మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావిస్తున్న తరుణంలో, అద్భుతంగా ఆడిన భారత ఆటగాడు అబ్దుల్ రఫీక్ అందించిన కార్నర్ కిక్ అవకాశాన్ని సబ్‌స్టిట్యూట్ ఆటగాడు సందీప్ మండి చాకచక్యంగా ఉపయోగించుకున్నాడు. 88వ నిమిషంలో హెడర్ (తలతో కొట్టి) ద్వారా గోల్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ చారిత్రాత్మక విజయంతో ‘బ్లూ టైగర్స్’గా పిలువబడే భారత జట్టు ట్రోఫీని గెలుచుకుని గర్వంగా తిరిగివచ్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత, పాకిస్థాన్ ఫుట్‌బాల్ జట్టు పరస్పర వైరాన్ని పక్కనపెట్టి భారత ఆటగాళ్లకు ‘గార్డ్ ఆఫ్ హానర్’ (గౌరవ వందనం) సమర్పించింది. ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాల్లో ఇదొక కొత్త, భావోద్వేగభరితమైన అధ్యాయంగా నిలవడంతో పాటు, సోషల్ మీడియాలో క్రీడాభిమానుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది. క్రికెట్లో ఇరు దేశాల ఆటగాళ్లు కరచాలనం (హ్యాండ్‌షేక్) చేసుకోవడానికి నిరాకరిస్తున్న తరుణంలో, ఇప్పుడు ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply