దేశ భద్రతతో చెలగాటమాడుతూ, కీలక రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ హ్యాండ్లర్లకు చేరవేస్తున్నారనే ఆరోపణపై భారత వైమానిక దళానికి చెందిన ఒక ఉద్యోగిని అరెస్ట్ చేశారు. సదరు ఉద్యోగి పాక్ ఏజెంట్ల కోసం గూఢచారిగా పనిచేస్తూ సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది.
అసోంలోని ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేసినట్లు ఆదివారం (మార్చి 22) రాజస్థాన్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
అధికారులు వెల్లడించిన వివరాలు: రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రఫుల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటెలిజెన్స్ మరియు వైమానిక దళ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ నిందితుడు పట్టుబడ్డాడు. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ‘ఝబరా రామ్’ అనే అనుమానితుడిని అరెస్ట్ చేసినప్పటి నుండి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఝబరా రామ్‌ను విచారించిన సమయంలో ‘సుమిత్ కుమార్’ అనే మరో వ్యక్తి గురించి సమాచారం లభించింది. సుమిత్ కుమార్ గత కొంతకాలంగా పాకిస్థాన్ హ్యాండ్లర్లతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
యూపీకి చెందిన నిందితుడు: పాక్ ఏజెంట్లతో చేతులు కలిపిన సుమిత్ కుమార్ (36) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం అతను అసోంలోని డిబ్రూఘర్ సమీపంలోని చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఎంటీఎస్ (MTS)గా పనిచేస్తున్నాడు. తన పదవిని అడ్డం పెట్టుకుని, సోషల్ మీడియా ద్వారా కీలక రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్ హ్యాండ్లర్లకు చేరవేస్తున్నాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
