గతేడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ‘ది హండ్రెడ్’ (The Hundred) టోర్నీ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ (SRL) కొనుగోలు చేయడంపై వెల్లువెత్తుతున్న నిరసనలు సమర్థనీయమేనని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
కావ్య మారన్ సహ-యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్, అబ్రార్‌ను సుమారు ₹2.3 కోట్లకు (£190,000) దక్కించుకుంది. అయితే, పాకిస్థాన్‌తో ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
గవాస్కర్ ఏమన్నారంటే: “ముంబై దాడుల (2008) తర్వాత భారత ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో విస్మరించాయి. పాక్ ఆటగాళ్లకు మనం చెల్లించే ఫీజులు, వారు తమ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రూపంలో చెల్లిస్తారు. ఆ సొమ్ముతో వారి ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేసి, పరోక్షంగా భారత సైనికులు మరియు పౌరుల మరణాలకు కారణమవుతోంది. ఈ నిజాన్ని గ్రహించిన భారతీయ సంస్థలు పాక్ కళాకారులను, క్రీడాకారులను దూరం పెడుతున్నాయి,” అని గవాస్కర్ తన కాలమ్‌లో పేర్కొన్నారు.
మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కూడా తమ రాడార్‌లో ఉన్నాడని కోచ్ డానియల్ వెట్టోరి చెప్పడం గవాస్కర్‌ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. “భారతీయ ప్రాణాల కంటే ఒక టోర్నమెంట్ గెలవడం ముఖ్యమా?” అని ఆయన ప్రశ్నించారు.
