అమృత్సర్ జిల్లా జలాల్ ఉస్మాన్ గ్రామంలో వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో 8 ఏళ్ల బాలుడు రంజిత్ సింగ్ దారుణంగా మృతి చెందాడు. సుఖ్వీందర్ సింగ్ కుమారుడైన రంజిత్, తన ముగ్గురు అక్కలకు ఒక్కగానొక్క తమ్ముడు. ఈ విషాద ఘటన బాలుడి కుటుంబాన్ని, గ్రామస్థులను తీవ్ర శోకసంద్రంలో ముంచింది.
రోజులాగే ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన రంజిత్, గ్రామంలోని క్రీడా మైదానం వద్దకు చేరుకోగానే వీధి కుక్కలు గుంపుగా అతడిని వెంబడించి దాడి చేశాయి. కుక్కల నుంచి తప్పించుకోవడానికి మైదానం వైపు పరుగెత్తిన బాలుడిని అవి చుట్టుముట్టి తల, ముఖం, కాళ్లపై తీవ్రంగా కరిచి గాయపరిచినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో బాలుడి కుడి చెవి కూడా తెగిపోయింది. చాలా సేపటి తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు దిగ్భ్రాంతితో కన్నీరుమున్నీరయ్యారు.
ఇప్పటికే అత్యంత పేదరికంలో ఉన్న రంజిత్ కుటుంబానికి ఈ ఘటన కోలుకోలేని దెబ్బగా మారింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి పైకప్పు కూలిపోయింది. అందుకు సంబంధించిన ప్రభుత్వ పరిహారం కూడా ఇప్పటివరకు అందలేదని చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో పేరుకు సంబంధించిన తప్పు ఉండటం వల్ల పరిహారం అందించే ప్రక్రియ ఆలస్యమవుతోందని, దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు కూడా చేశామని గ్రామస్థులు తెలిపారు.
గ్రామంలో వీధి కుక్కల బెడద చాలా కాలంగా ఉందని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపించారు. బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఇంటికి సంబంధించిన పెండింగ్ పరిహారాన్ని త్వరగా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బాబా బకాలా సాహిబ్ ఆసుపత్రికి తరలించారు. అలాగే సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply