“పాఠశాలలో అత్యవసర వైద్య సదుపాయాలు లేవా?”.. క్లాస్‌రూమ్‌లో అకస్మాత్తుగా కుప్పకూలిన 3వ తరగతి విద్యార్థిని.. ఆసుపత్రికి తరలిస్తుండగా జరిగిన విషాదం.. ఉలిక్కిపడేలా చేస్తున్న వీడియో..!!

ఢిల్లీలోని ఓ పాఠశాల తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలిన 9 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బాలిక, బుధవారం ఉదయం యధావిధిగా తరగతి గదిలో ఉంది. అప్పుడు అకస్మాత్తుగా ఆమెకు అనారోగ్య సమస్య ఏర్పడి స్పృహతప్పి కింద పడిపోయినట్లు చెబుతున్నారు. దీంతో బాలికను వెంటనే నిర్మాణ్ విహార్ ప్రాంతంలోని మాలిక్ రాడిక్స్ హెల్త్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. కానీ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఉదయం 9.52 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంబంధిత పాఠశాలకు చేరుకున్న పోలీసులు, తరగతి గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. అందులో బాలిక అకస్మాత్తుగా స్పృహతప్పి నేలపై పడిపోవడం రికార్డైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పాఠశాలలో తగిన అత్యవసర వైద్య సదుపాయాలు లేవని, బాలిక కుప్పకూలినప్పుడు వెంటనే సీపీఆర్ (CPR) వంటి చికిత్స అందించలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాఠశాలల్లో ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య పరికరాలు, ప్రథమ చికిత్స శిక్షణ పొందిన సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, బాలిక మృతికి గల అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాన్ని విచారించనున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా ఆరోగ్య కారణాల వల్లే బాలిక కుప్పకూలిపోయి ఉంటుందని భావిస్తున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి కుట్ర కోణం కనిపించలేదని పోలీసులు స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *